ఆర్మూర్ ప్రాంత రైతాంగం మరోసారి కదం తొక్కింది. రేవంత్ సర్కారుకు ఉద్యమ సత్తా రుచి చూపింది. షరతుల్లేని రుణమాఫీ కోసం పోరాటాల గడ్డ ఆర్మూర్‌లో రైతు ఐక్య కార్యాచరణ కమిటీ శనివారం నిర్వహించిన మహాధర్నా దిగ్విజయవంతమైంది. పోలీసు ఆంక్షలతో ఎంత అడ్డుకోవాలని చూసినా అన్నదాతలు లెక్క చేయలేదు. ఊరూరా దండు కట్టి ఆర్మూర్‌కు కదిలి వచ్చారు.
నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల నుంచి తరలి వచ్చిన రైతుల నినాదాలతో ధర్నా ప్రాంతం దద్దరిల్లింది. షరతుల్లేని రుణమాఫీ, రైతుభరోసా ప్రధాన డిమాండ్లతో రాజకీయాలకతీ తంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్, బీజేపీ, లెఫ్ట్ పార్టీలు సంఘీభావం తెలిపాయి. రైతుల ఉద్యమానికి అండగా ఉంటామని ప్రకటించాయి. మరోవైపు, వేలాదిగా తరలివచ్చిన ఈ మహాధర్నా శాంతియుతంగా ముగియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
ఆర్మూర్ రైతులు అంటేనే పోరాట వీరులని పెట్టింది పేరు. రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలను నమ్మి ఓట్లేసిన రైతులకే సున్నం పెడుతాండు. బాల్కొండ నియోజకవర్గంలో 51,128 మంది రైతులకు 15,849 మంది మాత్రమే మాఫీ అయింది. ఆర్మూర్‌లో 40,862 మందికిగాను 12,472 మందికి, నిజామాబాద్ రూరల్‌లో 52,646 మందికి గాను 12,472 మందికి మాత్రమే రుణమాఫీ వర్తించింది. డిమాండ్ల సాధన కోసం రైతులు చేసే పోరాటాలకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతునిస్తుంది.
– వేముల ప్రశాంత్‌రెడ్డి, మాజీ మంత్రి
ఎన్నికలకు ముందు రేవంత్‌రెడ్డి చెప్పిన మాటలను నమ్మి రైతులంతా మోసపోయిండ్రు. ఆంక్షలు పెట్టి అడుగడుగునా అడ్డుకున్నా వేలాది రైతులు రావడం అభినందనీయం. రాజకీయాలకు సంబంధం లేకుండా రైతులు ఇంత పెద్ద ఉద్యమానికి శ్రీకారం చుట్టడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ఆర్మూర్‌లో మొదలైన ఈ రైతు ఉద్యమం ఆరంభం మాత్రమే. హామీలు అమలు చేయకుంటే రైతులే గద్దె దించుతారు.
– జీవన్‌రెడ్డి, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే
అవగాహన లేని పాలన
అసత్యాలు, బూటకపు హామీలతో రేవంత్‌రెడ్డి ప్రజలను మోసం చేసిండు. రాష్ట్రంపై కనీస అవగాహన లేకుండా పరిపాలన చేస్తుండు. రుణమాఫీ విషయంలో రైతులను ఘోరంగా మోసగించిండు. బాసర సరస్వతీ అమ్మవారి సాక్షిగా, ఆర్మూర్ సిద్దుల గుట్ట దేవుడి మీద ఒట్టేసి రేవంత్‌రెడ్డి మాట తప్పిండు. కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసేదాకా వెంటాడుతాం. రైతు ఐక్యకార్యాచరణ కమిటీ ఉద్యమాలకు అండగా ఉంటాం.
– బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్యే
ఎలాంటి షరతులూ లేకుండా ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి గద్దెనెక్కిన సీఎం రేవంత్‌రెడ్డి.. దారుణంగా మోసం చేశారని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులతో ఆడుకుంటే ఏమవుతుందో గతంలో చూశారని, ఇచ్చిన మాట ప్రకారం మాఫీ చేయకపోతే రైతుల ఉద్యమ దెబ్బ రుచి చూపిస్తామని స్పష్టం చేశారు. ఏ రైతు అయినా మిమ్మల్ని రుణమాఫీ చేయాలని అడిగారా? ముఖ్యమంత్రి పీఠం కోసం మీరే రూ.2 లక్షల మాఫీ చేస్తామని చెప్పారని విమర్శించారు.
రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేసే వరకూ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 15 లోపు సంపూర్ణ రుణమాఫీ చేయాలని గడువు విధించారు. ఆలోపు చేయకపోతే మహారాష్ట్ర రైతుల ఉద్యమాన్ని తలపించేలా పోరాటం చేస్తామన్నారు. 50 వేల మందితో హైదరాబాద్‌కు వచ్చి, ప్రజాభవన్‌ను, అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఢిల్లీ కేంద్రంగా పంజాబ్ రైతులు ఎలా ఆందోళన చేశారో, రుణమాఫీ కోసం తెలంగాణ రైతులు హైదరాబాద్‌కు వచ్చి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతారన్నారు.
రుణమాఫీ అయ్యే వరకూ పోరాటం ఆగదు..
సీఎం రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన వెంటనే తొలి సంతకం రూ.రెండు లక్షల రుణమాఫీపైనే చేస్తానని చెప్పి రైతాంగాన్ని మోసం చేశాడని రైతు ఐక్యకార్యాచరణ కమిటీ చైర్మన్ ఇట్టడి లింగారెడ్డి అన్నారు. రూ. రెండు లక్షల రుణమాఫీ అయ్యే వరకూ పోరాటం ఆగదన్నారు. రైతు నాయకుడు తిరుపతిరెడ్డి మాట్లాడుతూ సెప్టెంబర్ 15నాటికి షరతులు లేకుండా రూ.రెండు లక్షల రుణమాఫీని చేయకపోతే ప్రగతిభవన్‌ను 50వేల మంది రైతులతో ముట్టడించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
దేవుళ్ల సాక్షిగా ఒట్టు వేసి కేవలం 15శాతం మేర రుణమాఫీ చేసి సీఎం రేవంత్‌రెడ్డి చేతులెత్తేశారని మండిపడ్డారు. రైతు నాయకుడు మంతెన నవీన్ మాట్లాడుతూ ఏ ఉద్యమమైనా ఆర్మూర్ నుంచే మొదలవుతుందని, సీఎం ఇప్పటికైనా కండ్లు తెరిచి ఇచ్చిన గడువులోగా రూ.రెండు లక్షల రుణమాఫీ చేయకపోతే ఈ ఉద్యమం రాష్ట్రమంతటికీ వ్యాపిస్తుందన్నారు. రైతు నాయకుడు పెద్దోళ్ల గంగారెడ్డి మాట్లాడుతూ రైతులకిచ్చిన హామీలన్నీ సీఎం రేవంత్‌రెడ్డి తుంగలో తొక్కాడని, గడువులోగా హామీలు నెరవేర్చకపోతే ప్రభుత్వం మెడలు వంచైనా రుణమాఫీ చేయించుకుంటామన్నారు.
మంతెన శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ చెవిటి సర్కారుకు రైతుల సమస్యలు వినబడడం లేదని, సీఎం కుర్చీ కోసమే రేవంత్‌రెడ్డి ఆరు గ్యారెంటీలను తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు. చింత మహేశ్ మాట్లాడుతూ ఢిల్లీ కేంద్రంగా పంజాబ్ రైతులు ఎలా ఆందోళన చేస్తున్నారో.. రైతు రుణమాఫీ కోసం తెలంగాణ రైతులు రాజధాని హైదరాబాద్‌కు వచ్చి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతారన్నారు. రైతులను మోసం చేసిన ఏ ప్రభుత్వాలూ ఎక్కువ రోజులు ఉండలేవని నిజామాబాద్ జడ్పీ మాజీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు అన్నారు.
హామీలన్నీ నెరవేర్చాలి
ఆర్మూర్‌లో నిర్వహించిన రైతు ఐక్యవేదిక మహాధర్నాకు జగిత్యాల రైతు ఐక్యకార్యాచరణ కమిటీ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి ఐదుగురు సభ్యుల బృందం సంఘీభావం ప్రకటించారు. షరతులు లేకుండా రూ.రెండు లక్షల రుణమాఫీ, రైతుభరోసా, ధరణిలో పెండింగ్ సమస్యల పరిష్కారం, వ్యవసాయ రంగానికి ఇచ్చిన హామీలని అమలు చేయాలన్నారు. అనంతరం ఆర్డీవోకు రైతు ఐక్యవేదిక కమిటీ ప్రతినిధులు ఇట్టడి లింగారెడ్డి, దేగాం యాదాగౌడ్, పట్కూరి తిరుపతిరెడ్డి, జైడి భాస్కర్, ప్రభాకర్, నూతుల శ్రీనివాస్‌రెడ్డి, అర్గుల్ సురేశ్, కె.రాజారెడ్డి, మోతె రమేశ్, మచ్చర్ల సాగర్, నక్కల భూ మ్‌రెడ్డి, ముప్కాల్ సంతోష్‌రెడ్డి, భూమేశ్, సాగర్, సుధాకర్, సంతోష్‌రెడ్డి, నవీన్‌రెడ్డి, రాజన్న, ప్రతాప్‌రెడ్డి లేఖ అందజేశారు.
వాహనాల దారి మళ్లింపు ఆర్మూర్‌లోని 44వ నంబర్ జాతీయ రహదారిపై మహాధర్నా నేపథ్యంలో ఎలాంటి ఇబ్బంది కలుగకుండా సీపీ కల్మేశ్వర్ ఆదేశాల మేరకు పోలీసులు వాహనాలను దారి మళ్లించారు. ప్రధాన కూడళ్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
హామీ ప్రకారం రుణ మాఫీ చేయాలి
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎన్నికలకు ముం దు ఇచ్చిన మాట ప్రకారం రుణ మాఫీ చేయా లి. మాట తప్పి రైతులను మోసం చేయడం సరికాదు. ఎన్నో రోజుల నుంచి రుణ మాఫీ కోసం ఎదురుచూస్తున్నాం. సీఎం స్థాయిలో ఉండి మాట తప్పడం సరికాదు. వెంటనే రూ. 2 లక్షల రుణ మాఫీ చేయాలి.
– తిరుపతి రెడ్డి, రైతు, మారంపల్లి
హైదరాబాద్‌కు తరలివెళ్తాం..
షరతులు లేని రూ. 2 లక్షల రుణ మాఫీ వచ్చే వరకూ పోరాడుతాం. కలిసికట్టుగా ఐక్యకార్యచరణ కమిటీ ద్వారా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతాం. ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోకపోతే హైదరాబాద్ వరకైనా వెళ్లి ఉద్యమిస్తాం.
– సామ మహేందర్, రైతు, ఆర్మూర్
సెప్టెంబర్ 15లోగా నిర్ణయం తీసుకోవాలి
రైతు ఐక్య కార్యాచర ణ కమిటీ ఇచ్చిన గ డువు సెప్టెంబర్ 15 లోగా రూ.2 లక్షల రుణ మాఫీపై నిర్ణ యం తీసుకోవాలి. లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. రైతులు రోడ్లపైకి వచ్చేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు.
– ఎర్రముల్ల చిన్నారెడ్డి, రైతు, మారంపల్లి