నాగిరెడ్డిపేట, మార్చి 13: మండల కేంద్రంలోని రైతువేదికలో మాల్తుమ్మెద సింగిల్‌విండో అధ్వర్యంలో గురువారం నిర్వహించిన మహాజన సభ రైతుల నిరసనల మధ్య కొనసాగింది. రైతు రుణమాఫీతోపాటు పలు సమస్యలపై రైతులు పాలకవర్గంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. సొసైటీ అధ్యక్షుడు దుందిగళ్ల నర్సింహులు అధ్యక్షతన నిర్వహించిన సభలో సీఈవో సందీప్ 2024-25 మార్చి వరకు సొసైటీ ద్వారా జరిగిన లావాదేవీలను చదువుతుండగా సభ్యులు అడ్డుకున్నారు.
రైతుల ఇబ్బందులను విండో పాలకవర్గం ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు. ఇప్పటివరకు 108 మంది రైతులకు (రూ.45 లక్షలు) రుణమాఫీ కాలేదని, దీనిపై ఎవరూ స్పందించడంలేదన్నారు. ఎవరి తప్పో కానీ, రైతులకు మాత్రం నష్టం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలులో సైతం తరుగుతో పాటు డ్రైవర్ కోసం బస్తాకు ఒక రూపాయి చొప్పున వసూలు చేశారన్నారు. కాంటా చేసిన ధాన్యాన్ని రైస్‌మిల్‌కు పంపే క్రమంలో దారి మధ్యలో పడిపోతే.. ఆ నష్టాన్ని రైతులపై వేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
సొసైటీల తీరుతో రైతులకు నష్టమే తప్ప లాభం లేదన్నారు. సొసైటీ ఆధ్వర్యంలో ధర్మకాంటా ఏర్పాటు చేయాలని గతేడాది తీర్మానిస్తే ఇప్పటివరకు ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. వెంటనే ఏర్పాటు చేయాలని కోరారు. జమా, ఖర్చులు సమానంగా చేసి ఉన్నాయని, ఖర్చులకు సంబంధించిన వివరాలను ఇవ్వాలన్నారు. గతేడాది ఎరువుల స్టాక్ ఎంత ఉంది, ఈ ఏడాది స్టాక్ ఉన్న వివరాలను తెలపాలని రైతులు కోరారు. సీఈవో వద్ద వివరాలు లేకపోవడంతో రైతులు నిరసన వ్యక్తం చేశారు. మాల్తుమ్మెద గేట్ వద్ద సొసైటీ కొనుగోలు చేసిన స్థలం వివరాలు, సొసైటీ పేరున ఉన్న పత్రాలు చూపాలని రైతులు కోరారు. సరైన ఆధారాలు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.