బిచ్కుంద, నవంబర్ 13 : బిచ్కుంద మార్కెట్ కమిటీ కార్యాలయం ఎదుట రైతులు బుధవారం ధర్నా చేపట్టారు. ‘కొర్రీలు లేకుండా సోయాను కొనుగోలు చేయాలి’ అని నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చిన కథనానికి ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించారు. బిచ్కుందలోని మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సోయా కొనుగోలు కేంద్రాన్ని ఎన్సీసీఎఫ్ రాష్ట్ర అధికారులు, నాఫెడ్, మార్క్‌ఫెడ్ అధికారులు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావుతో కలిసి గురువారం సందర్శించి, సోయాను పరిశీలించారు.
అకాలవర్షాల కారణంగా సోయాను చెన్నీ పట్టినప్పుడు సోయాతోపాటు సోయా సైజు చిన్న మట్టి గింజలు వస్తున్నాయని, వాటిని వేరు చేయడం కష్టంగా ఉన్నదని, వాటికి పరిష్కార మార్గం చూపాలని రైతులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. వ్యవసాయ మంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించేలా చూస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అనంతరం మార్కెట్ కమిటీ కార్యాలయంలో అధికారులతో సమీక్షించి మాట్లాడారు. ప్రతి సోయా గింజనూ కొనుగోలు చేయాలని అధికారులకు సూచించారు. సమావేశంలో ఎన్సీసీఎఫ్ స్టేట్ ఆఫీసర్ రవిచంద్ర, దువ్వా వినయ్, ఎన్ఎఫ్సీఎల్ సర్వేయర్ మహేశ్, మార్క్‌ఫెడ్ డీఎం శశిధర్‌రెడ్డి, మార్క్‌ఫెడ్ మార్కెటింగ్ ఆఫీసర్ చందు, బిచ్కుంద రైతు సహకార సంఘం అధ్యక్షుడు నాల్చర్ బాలాజీ, సంఘం కార్యదర్శి శ్రావణ్, నాయకులు విఠల్‌రెడ్డి, గంగాధర్, సహకార సంఘం సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.