Farmers Protest | మోర్తాడ్ : యూరియా యాప్ బంద్ చేయాలని డిమాండ్ చేస్తూ మోర్తాడ్ మండలంలోని ధర్మోరా గ్రామంలో రైతులు శనివారం ఆందోళన చేపట్టారు. ధర్మోరా గ్రామంలోని వ్యవసాయ గిడ్డంగికి తాళం వేసి, గిడ్డంగి ముందు టెంట్ వేసుకుని 2గంటల పాటు ధర్నా నిర్వహించారు. తమ గ్రామంలోని గిడ్డంగిలో యూరియా ఉన్నా యాప్ లో తమకు బుక్ కాకుండా ఇతర గ్రామాల్లోని రైతులకు బుక్ అవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
యాప్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న వ్యవసాయ అధికారి హరీష్ గిడ్డంగి కి వేసిన తాళం తీయాలని కోరగా రైతులు అందుకు అంగీకరించలేదు. తమ గ్రామంలో ఉన్న యూరియా సంచులు తమకే ఇవ్వాలని లేదంటే గిడ్డంగి తాళాలు తీసేదే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.