బాన్సువాడ, డిసెంబర్ 25: ఎరువుల కోసం రైతులను ముప్పుతిప్పలు పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం వారికి మరో షాక్ ఇచ్చింది. వానకాలంలో యూరియా కోసం గంటల తరబడి క్యూలోనే ఉన్న అన్నదాతలకు ‘ఫర్టిలైజర్ బుకింగ్ యాప్’తో చిక్కుల్లోకి నెట్టింది. రైతులకు ఎరువులను అందుబాటులో ఉంచాల్సిందిపోయి, ఎరువుల కష్టాలను మరింత ఎక్కువ చేసేలా రూపొందించిన యాప్ అందుబాటులోకి తెచ్చింది.
ఈ యాప్‌ను ప్రారంభించిన తొలిరోజునే పనిచేయకపోవడం గమనార్హం. దీంతో రైతులకు యాసంగిలో కష్టాలు తప్పేలా లేవనే వాదనలు వినిపిస్తున్నాయి. అసలే అంతంత మాత్రం చదువులతో సేద్యం చేసుకుంటున్న రైతన్నకు మొబైల్ యాప్ ద్వారా ఎరువులను బుక్ చేసుకోవాలంటే కత్తి మీద సాములాంటిదేనని పేర్కొంటున్నారు. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్నప్పటికీ చాలా మంది రైతుల వద్ద ఆండ్రాయిడ్ ఫోన్లు లేవు. ఇప్పటికీ కీ ప్యాడ్ ఫోన్లనే ఉపయోగిస్తున్నారు. ఒకవేళ ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్నా యాప్‌లో ఎరువులు బుక్ చేయడం , ఓటీపీలు చెప్పడంపై ఏ మాత్రం అవగాహన లేదు.
ఈసారి యాసంగికి కూడా కష్టాలు తప్పేలా లేవని రైతులు ఆందోళన చెందుతున్నారు. చాలా మంది రైతులకు ఎరువుల షాపుల పేర్లు కూడా తెలియని పరిస్థితి. యాప్‌లో ఎరువులను బుక్ చేసుకుంటే ఊరు, దుకాణం పేరు నమోదై ఉంటుంది. ఏ షాపు పేరు బుక్ చేస్తే అదే దుకాణానికి వెళ్లి ఐటీ నంబర్ చెబితేనే ఎరువులు ఇస్తారు. లేకపోతే ఎరువులు తీసుకోవడం కుదరదు. అది 15 రోజులు దాటితే ఎరువుల బుకింగ్ క్యాన్సిల్ అవుతుంది. ఇలాంటి సమస్యలను రైతులు ఎలా అధిగమిస్తారని, లేక పాత పద్ధతిని ఎంచుకుంటారా అనేది వేచిచూడాలిమరి.
పంటల వివరాలు నమోదు చేసుకొని రైతులకు సాగుపై అవగాహన కల్పించాల్సిన వ్యవసాయ శాఖకు ప్రభుత్వం కొత్త టాస్క్ అప్పజెప్పింది. యాప్‌లపై అవగాహన లేని రైతులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత వ్యవసాయ విస్తీర్ణాధికారులదే. డీలర్ షాపుల వద్ద ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసి యాప్‌లపై అవగాహన కల్పించాలని చెప్పడంతో అధికారులు నానా ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. ఇప్పటికే ఏఈవోలకు జిల్లా అధికారులు అవగాహన కల్పించే పనిలో పడ్డారు. మారుమూల గ్రామాల్లో రైతులకు అసలు సమాచారం చేరుతుందా, ఆ గ్రామాలకు ఏఈవోలు వెళ్తారా అనేది పెద్ద ప్రశ్న. కామారెడ్డి జిల్లాలో 4 లక్షల 4 వేల 525 ఎకరాలు రైతులు సాగుచేస్తున్నట్లు వ్యవసాయ శాఖ వద్ద లెక్కలు ఉన్నాయి. దీంతోపాటు 40 వేల మంది కౌలు రైతులు కూడా సాగుచేస్తున్నట్లు అంచనా వేశారు. యాసంగి పంటలకు సకాలంలో రైతులకు ఎరువులు అందుతాయో లేదా చూడాల్సిందే మరి.
గతంలో ఇచ్చినట్లే ఎరువులను పాత పద్ధతిలోనే ఇవ్వాలి. ఫోన్ల గురించి మాకు తెలియదు. మేము ఇప్పటికీ చిన్న ఫోన్లనే వాడుతున్నం. ఎప్పుడు, ఎలా బుక్ చేసుకోవాలో మాకు తెలియదు. వానకాలంలో ఇచ్చినట్లు గోదాంలో పైసలు కట్టి తీసుకపోయినట్లు ఇస్తే బాగుంటది.
-ఒడ్డె గణేశ్, రైతు, కొల్లూర్