ధర్పల్లి, నవంబర్ 23 : కాంగ్రెస్ హయాంలో రైతుల కష్టాలు రెట్టింపయ్యాయి. పంట పండించడం ఒకెత్తయితే అమ్ముకోవడం మరో ఎత్తులా మారింది. కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం, కాంటాలు వేయడంలో ఆలస్యం.. తీరా పంటను అమ్ముకున్నాక డబ్బులు రాక రైతు ఆగమవుతున్నాడు. రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పంటను కోతలు కోసినాక పక్షం రోజులకు కానీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. ఇక, సంచులు వచ్చి, కాంటాలు వేయడానికి మరో నెలరోజులకు పైగా పట్టింది. హమ్మయ్య.. ఎట్టకేలకు పంట అయితే అమ్ముకున్నామని సంబురపడ్డ రైతులకు ఆ సంతోషం లేకుండా పోతున్నది. వడ్లు అమ్మి పక్షం రోజులైనా డబ్బులు రాకపోవడంతో అన్నదాతలు ఆగమవుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో వానకాలంలో భారీగా వరి సాగైంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో కలిపి లక్షలాది ఎకరాల్లో రైతులు నాట్లు వేశారు. అయితే, పంట చేతికొచ్చే సమయంలోనే ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేయాల్సి ఉండగా, కాంగ్రెస్ సర్కారు పట్టించుకోలేదు. కేసీఆర్ పాలనలో పంట కోతల సమయానికే ధాన్యం సేకరణకు అన్ని ఏర్పాట్లు చేసే వారు. గన్నీబ్యాగులు, హమాలీలతో పాటు మిల్లర్ల కేటాయింపు పూర్తిచేసి, కొనుగోలు వెంటవెంటనే ప్రారంభించే వారు. కానీ, రేవంత్ సర్కారు పాలనలో మాత్రం అలాంటి ఏర్పాట్లు జరుగలేదు.
మరోవైపు, రబీ సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే కొన్నిచోట్ల నార్లు పోయడం ప్రారంభించారు. అయితే, విత్తనాలు, ఎరువుల కోసం చేతిలో చిల్లిగవ్వ లేక కర్షకులు సతమతవుతున్నారు. కేసీఆర్ హయాంలో పంట సాగుకు ముందే ఎకరాకు రూ.5 వేల చొప్పున రైతుబంధు ఇచ్చి అన్నదాతలకు అండగా నిలిచారు. అలాగే, పంట అమ్మిన తర్వాత నాలుగైదు రోజుల వ్యవధిలోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసే వారు. కానీ, కాంగ్రెస్ వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పటికే వానాకాలం రైతుబంధు డబ్బులను రేవంత్ సర్కారు ఎగ్గొట్టింది. రబీలోనూ ఇస్తారన్న నమ్మకం లేకుండా పోయింది. కనీసం పంట పైసలు వస్తే అయినా పెట్టుబడికి ఉపయోగపడతాయని అనుకుంటే అవి కూడా రావడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. రైతులకు మేలు చేసే కేసీఆర్‌ను దూరం చేసుకుని అనుభవిస్తున్నామని చెబుతున్నారు.
వానాకాలంలో సాగు చేసిన వరిని కోసి ఆరబెట్టిన రైతులు కొనుగోళ్ల కోసం రోజుల తరబడి నిరీక్షించారు. సర్కారు ముందస్తు ఏర్పాట్లు లేకపోవడంతో ధాన్యం సేకరణలో జాప్యం జరిగింది. మరోవైపు, మొదట్లో కొబ్బరికాయలు కొట్టి కేంద్రాలను ప్రారంభించిన అధికారులు.. రైసుమిల్లులు కేటాయించకపోవడంతో కాంటాలు వేయడం ప్రారంభం కాలేదు. దీంతో పక్షం రోజులకు పైగా కొనుగోళ్లు ఊపందుకోలేదు. రైతులు ఆగ్రహిస్తున్న తరుణంలో యంత్రాంగం కాంటాలు వేయడం ప్రారంభించింది. పంట కోసిన నెల రోజులకు అన్నదాతలు వడ్లు అమ్ముకున్నారు.
ఏదో విధంగా పంట విక్రయించుకున్న రైతులకు ఇప్పుడు మరో సమస్య వచ్చి పడింది. పక్షం రోజులైనా ధాన్యం డబ్బులు రాకపోవడంతో రైతాంగం ఆందోళన చెందుతున్నది. గతంలో కొనుగోలు జరిగిన రెండు, మూడు రోజుల్లో లేదా వారం లోపే ధాన్యం డబ్బులు ఖాతాల్లో పడేవి. కానీ ఇప్పుడు ప్రభుత్వ అలసత్వమో, అధికారుల నిర్లక్ష్యమో ఏమో కానీ పక్షం రోజులైనా డబ్బులు పడడం లేదని రైతులు వాపోతున్నారు. కొనుగోళ్లు జరిగిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ వారం, పది రోజులు దాటుతున్నా డబ్బులు మాత్రం రావడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వడ్లు అమ్మి పదిహేను రోజులు అయిపోయింది. ఇప్పటికీ వడ్ల డబ్బులు రాలే. మా గ్రామంలో చాలామంది రైతుల పరిస్థితి ఇదే. ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవటమే తప్ప చేసిందేమి లేదు. కాంగ్రెస్ అచ్చినంక రైతులకు బాధలే తప్ప ఎలాంటి లాభం లేదు. రైతుల సమస్యను రాజకీయ కోణంలో కాకుండా మానవతా దృక్పథంతో ఆలోచించాలి. వడ్ల పైసలను వెంటనే రైతుల ఖాతాల్లో వేయాలి.
– కోతి శేఖర్‌రెడ్డి, రైతు, దుబ్బాక