మాక్లూర్, నవంబర్ 16 : ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల చిల్లర వేషాలు ఆగడం లేదు. తరుగు పేరిట ఎక్కడికక్కడ దోచుకుంటున్న ఉదంతాలు బయటకొస్తున్నాయి. ఆరుగాలం కష్టించి పండించిన పంటను బొక్కేయడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాపాలనలో ఇదేం దోపిడీ అంటూ మండిపడుతున్నారు. ఒకటి, రెండు కాదు, ఏకంగా 13 క్వింటాళ్ల ధాన్యాన్ని తరుగు పేరిట కొట్టేశారని మాక్లూర్ మండలం బొంకన్‌పల్లికి చెందిన రైతు నరేశ్‌కుమార్ శనివారం వాపోయారు.
అసలేం జరిగిందంటే.. ఈ నెల 7న ధాన్యం కాంటా వేసి, 765 బస్తాలను కాలూర్ శివారులోని ఓ రైస్‌మిల్‌కు పంపించారు. అయితే, తరుగు పేరిట 33 బస్తాలను తగ్గించారని నరేశ్ తెలిపారు. ధాన్యం పూర్తిగా ఎండిన తర్వాతే కాంటా వేశారని, తీరా రైస్‌మిల్‌కు వెళ్లిన వారం రోజుల తర్వాత తరుగు పేరుతో 13 క్వింటాళ్లు తగ్గించారన్నారు. దీంతో తనకు 30 వేల నష్టం వాటిల్లిందని విలేకరులతో తన ఆవేదనను వ్యక్తం చేశారు. అధికారులు పట్టించుకోకపోవడంతో తనలాంటి రైతులెందరో నష్టపోతున్నారని, ఇప్పటికైనా స్పందించి మిల్లర్ల దోపిడీ నుంచి రైతులను కాపాడాలని కోరారు.