గాంధారి, సెప్టెంబర్ 13: ఆరుగాలం కష్టం చేసి పంటలను పండించే రైతన్నకు సాగు పనిలో చేదోడు వాదోడుగా ఉండే ఎడ్లతో విడదీయరాని బంధం. చేనులో దుక్కిని దున్ని, విత్తనం విత్తిన నుంచి, పంట నూర్పిడి చేసి ,ధాన్యాన్ని ఇంటికి తెచ్చేంత వరకు ప్రతి పనిలో రైతన్నకు, ఎడ్లు ఏదో రకంగా సహకరిస్తుంటాయి. భూమిని నమ్ముకొని వ్యవసాయం చేసే రైతులు, సాగులో సహాయపడే బసవన్నలను ప్రేమగా చూసుకోవడంతోపాటు దైవంగా భావిస్తారు. ఎడ్లను నందీశ్వరుని అవతారంగా భావించే రైతులు వాటిని పూజించి తమ భక్తిని చాటుకుంటారు. ఎడ్ల పొలాల అమావాస్య వచ్చిందంటే చాలు ఉన్నదాతల ఇండ్లలో పండుగ వాతావరణం నెలకొంటుంది. ప్రతి సంవత్సరం ఎడ్ల పొలాల అమావాస్య రోజు ఎడ్లను భక్తితో పూజిస్తారు. ఏటా శ్రావణ మాసం ముగింపు రోజు రైతన్నలు ఎడ్ల పొలాల పండుగను జరుపుకొంటారు. ఈ పండుగనే ఎడ్ల పొలాల అమావాస్య, పొలాల అమావాస్య అని పిలుస్తుంటారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వ్యవసాయదారులు జరుపుకొనే పెద్ద పండుగల్లో ఎడ్ల పొలాల అమావాస్య ప్రధానమైనది. రైతులు నేడు(గురువారం) ఎడ్ల పొలాల అమావాస్యను జరుపుకోనున్నారు.
నిజామాబాద్ కల్చరల్, సెప్టెంబర్ 13 : రైతులు భక్తిశ్రద్ధలతో నిర్వహించే పొలాల అమావాస్యను నేడు (గురువారం) జరుపుకోనున్నారు. శ్రావణ బహుళ అమావాస్య రోజున నిర్వహించే పొలాల అమావాస్య స్త్రీలకు విశేషమైన పండుగ. జిల్లా కేంద్రంలోని బొబ్బిలి వీధి, దుబ్బ, ఎల్లమ్మగుట్ట, కంఠేశ్వర్, వినాయక్‌నగర్ తదితర ప్రాంతాల్లోని రైతులు ఎడ్లకు ప్రత్యేక పూజలు చేయటానికి ఏర్పాట్లు చేశారు. పార్వతీదేవి చెప్పిన పొలాల అమావాస్య వ్రతకథను మహిళలు ఆచరించి కుటుంబసభ్యులు క్షేమంగా ఉండాలని కోరుతూ వాయినాలు ఇవ్వడం అనవాయితీ. రైతులు కాడెద్దులను పూజించి, అలంకరించి తీపి నైవేద్యాలను సమర్పించి, గ్రామదేవతకు ప్రత్యేక నైవేద్యాలు సమర్పిస్తారు. మహిళలు సంతానం కోసం పొలాల అమావాస్య వ్రతాన్ని ఆచరించడం పరిపాటి. పూర్ణంతో చేసిన బూరెలను ఎడ్లకు తినిపిస్తారు. కుటుంబ సభ్యులందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని పూర్ణం బూరెలు వాయినంగా తమ సంతానానికి, ముత్తెదువులకు ఇవ్వడం ఈ పండుగ ప్రత్యేకత.
ఎడ్ల పొలాల అమావాస్య వచ్చిందంటే చాలు వ్యవసాయం చేసే రైతులు తమ వద్ద ఉండే ఎడ్లను రెండు, మూడు రోజుల నుంచే పండుగ కోసం సిద్ధం చేస్తారు. ఈ పండుగను పురస్కరించుకొని రైతులు ఉదయాన్ని సమీపంలోని చెరువులు, వాగుల్లోకి ఎడ్లను తీసుకెళ్లి శుభ్రంగా కడుగుతారు. అనంతరం ఇండ్లకు తీసుకువచ్చి రకరకాల రంగులను ఎడ్లఒంటిపై అందంగా అద్దుతారు. కొమ్ములకు రంగులు వేస్తారు. కాళ్లు, మెడలకు గజ్జలు, గంటలతో కూడిన దండలను కడతారు. నడుముపై జూలువేస్తారు. కొత్త మూకుతాళ్లతోపాటు రంగురంగుల తాళ్లతో చేసిన మోర్కెలను కట్టి అందంగా అలంకరిస్తారు. ఎద్దుల అలంకరణ విషయంలో గ్రామాల్లో రైతులు ఒకరికి మించి ఒకరు పోటీపడి ముస్తాబు చేస్తారు. అనంతరం ఎడ్ల నుదట కుంకుమ పెట్టి మంగళహారతులిస్తారు. అప్పటికే సిద్ధం చేసిన ఉలువలు, బబ్బెర్లతో ఉడకబెట్టిన గూడాలను, బెల్లంతో చేసిన పాకాన్ని, పిండి వంటలను బసవన్నలకు తినిపిస్తారు. అనంతరం గ్రామాల్లోని ప్రధాన వీధులగుండా ఎడ్లను ఊరేగించి పంట చేనుల్లోకి తీసుకెళ్తారు.
పొలాల అమావాస్య సందర్భంగా మండల కేంద్రాల్లో సందడిగా ఉన్నది. ఎడ్లకు అలంకార సామగ్రి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. రంగురంగుల తాళ్లు, పగ్గాలు, గజ్జెలు, గంటలు, ఎడ్ల కొమ్ములకు పూయడానికి రంగులు విక్రయించే దుకాణాల్లో సందడి ఎక్కువగా కనిపిస్తున్నది. వారాంతపు సంతలో వీటికి గిరాకీ ఎక్కువగా ఉంది.
వ్యవసాయ పనుల్లో మా కుటుంబానికి ఆసరాగా ఉంటున్న బసవన్నలు(ఎడ్లు) అంటే ఎంతో ఇష్టం. ప్రతి సంవత్సరం ఎడ్ల పొలాల అమావాస్య రోజు పండుగను ఘనంగా జరుపుకొంటాం. ఎడ్లను శుభ్రంగా కడిగి, రకరకాల రంగులను అద్దుతాం. గజ్జెలు, గంటలతో చేసిన దండలను కట్టి అందంగా అలంకరిస్తాం.
– దేమె బాలయ్య, రైతు, గాంధారి
ఎవుసంలోని ప్రతి పనిలో సహకరించే ఎడ్లకు పండుగను నిర్వహించడం సంతోషంగా ఉంటుంది. ఎడ్ల పొలాల అమావాస్య రోజు ఎడ్లకు ఉలువలు, బబ్బెర్లతో తయారు చేసిన గూడాలు, బెల్లం పాకాన్ని తినిపిస్తాం. పండుగ రోజున ఎద్దులతో ఎలాంటి పనులూ చేయించం.
– ఈకె. రాములు, రైతు, మాధవపల్లి