న్యూఢిల్లీ : మానవరహిత గగన్‌యాన్ ప్రాజెక్టుకు చెందిన కీలక విషయాన్ని ఇవాళ ఇస్రో(ISRO) చైర్మెన్ వీ నారాయణన్ వెల్లడించారు. గగన్‌యాన్ ప్రాజెక్టు సంబంధించిన పరీక్షను జనవరిలో నిర్వహించనున్నట్లు చెప్పారు. అంతరిక్షంలోకి మానవులను పంపాలని ఇస్రో ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. దీని కోసం గగన్‌యాన్ ప్రాజెక్టును చేపట్టింది. అయితే స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన రాకెట్లో ఆస్ట్రోనాట్లను అంతరిక్షంలోకి పంపాలని ఇస్రో భావిస్తున్నది. ఈ ప్రయోగాన్ని 2027లో చేపట్టాలన్న సంకల్పంతో ఉన్నట్లు ఇస్రో చీఫ్ నారాయణన్ తెలిపారు.
గగన్‌యాన్ ప్రాజెక్టులో భాగంగా అనేక పరీక్షలు జరుగుతున్నట్లు ఇస్రో చీఫ్ చెప్పారు. ఇప్పటికే ఆ మిషన్‌కు చెందిన సుమారు 8000 టెస్టులను నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు. ఇవాళ ఢిల్లీలో జరిగిన ఎమర్జింగ్ సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ సదస్సులో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. భూ కక్ష్యలోకి మానవులను పంపడానికి ముందు.. కనీసం మూడుసార్లు మానవరహిత పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు.
భారతీయ అంతరిక్ష స్టేషన్‌కు చెందిన కీలక విషయాన్ని కూడా ఆయన వెల్లడించారు. 2028లో భారతీయ అంతరిక్ష స్టేషన్‌కు చెందిన ఫస్ట్ మాడ్యూల్‌ను లాంచ్ చేయనున్నట్లు ఇస్రో చీఫ్ చెప్పారు. మొత్తం అయిదు మాడ్యూల్స్‌ను నింగిలోకి పంపనున్నారు. ఫైవ్ మాడ్యూల్ ఆర్బిటాల్ ల్యాబ్‌ను 2035లో ఆపరేషన్లోకి తీసుకున్నట్లు నారాయణన్ తెలిపారు. భారతీయ స్పేస్ స్టేషన్ కనీసం 52 టన్నుల బరువు ఉండనున్నది. ముగ్గురు లేదా నలుగురు వ్యోమగాములు ఉండే రీతిలో దీన్ని నిర్మిస్తున్నారు. స్వల్ప కాలం ఆరుగురు ఉండే రీతిలో స్పేస్ స్టేషన్‌ను నిర్మించనున్నట్లు చెప్పారు.