లింగంపేట(తాడ్వాయి)/కామారెడ్డి, జనవరి 10: ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుపై రైతులు, బీఆర్ ఎస్ శ్రేణులు కదం తొక్కారు. ఇచ్చిన హామీలను అమలుచేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం తాడ్వాయి నుంచి కామారెడ్డి కలెక్టరేట్ వరకు రైతు పోరుబాట పాదయా త్ర చేపట్టారు. ఈ కార్యక్రమంలో రైతులతో కలిసి ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాజాల మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిందన్నారు.
అధికారంలోకి రాగానే రూ. 2 వేల పింఛన్ రూ.4వేలకు పెంచుతామని హామీ ఇచ్చి ఇప్పటివరకు ఇవ్వలేదని మండిపడ్డారు. రూ. 2 లక్షల రుణమాఫీ కేవలం 50 శాతం మంది రైతులకు మాత్రమే చేశారని తెలిపా రు. మిగతా వారికి కూడా వెంటనే మాఫీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా రూ.15వేలు ఇస్తామని చెప్పి, రూ. 12వేలకు కుదించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కౌలు రైతుకు రూ. 12వేలు వెంటనే విడుదల చేయాలన్నారు. కల్యాణలక్ష్మి కింద రూ. లక్షతోపాటు తులం బంగారం ఇస్తానని ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డి, ఇప్పటి వరకు ఒక్కరికీ కూడా మాసం బంగారం ఇచ్చిన పాపాన పోలేదన్నారు. అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజల దృష్టి మరల్చడానికి హైడ్రా పేరుతో డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. హామీల అమలులో విఫలమైన కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎన్నికల కోసం గ్రామాల్లోకి వస్తే అడుగుపెట్టనీయబోమని హెచ్చరించారు. 15కిలో మీటర్ల మేర పాదయాత్ర చేసిన రైతులు, బీఆర్ఎస్ నాయకులు కలెక్టరేట్‌కు చేరుకొని అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో తాడ్వాయి విండో చైర్మన్ కపిల్‌రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ నర్సింహు లు, బీఆర్ఎస్ లింగంపేట మండల అధ్యక్షుడు దివిటి రమేశ్, నాయకులు సాయిరెడ్డి, రాజారెడ్డి, మంగారెడ్డి, సంజీవులు, రమేశ్, వెంకట్రావు, రాజారెడ్డి, తిరుపతిరెడ్డి, శివాజీ తదితరులు పాల్గొన్నారు.