ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక పేరిట గురువారం నిర్వహించిన గ్రామ/వార్డు సభలు గందరగోళంగా మారాయి. నిరసనలు, నిలదీతలతో హోరెత్తాయి. ప్రధానంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ప్రశ్నల వర్షం కురిసింది. ఆరు గ్యారంటీల అమలు, అభివృద్ధి పనుల్లో జాప్యంపై జనాగ్రహం వెల్లువెత్తింది. రుణమాఫీ, రైతుభరోసా, యూరియా యాప్ తదితర సమస్యలపై రైతులు గొంతెత్తారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్ల మంజూరు వంటి వాటిపై ప్రజలు నిలదీశారు. సమాధానం చెప్పలేక అధికార పార్టీ నాయకులు, అధికారులు తెల్ల ముఖం వేశారు.
మోర్తాడ్/ఏర్గట్ల/కోటగిరి/నస్రుల్లాబాద్/ఎల్లారెడ్డి/సారంగాపూర్/నవీపేట, ఏప్రిల్ 2 : కాంగ్రెస్ ప్రభుత్వంపై జనాగ్రహం వెల్లువెత్తింది. ఉమ్మడి జిల్లాలో నిర్వహించిన గ్రామ సభల్లో సర్కారు దమన నీతిపై ప్రశ్నల వర్షం కురిసింది. నిలదీతలు, నిరసనలతో గ్రామ, వార్డు సభలు గందరగోళంగా మారాయి. హామీల ఎగవేత, అభివృద్ధి పనుల్లో జాప్యంపై ప్రజలు గొంతెత్తారు. రుణమాఫీ కాలేదని, రేషన్ కార్డు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. పింఛన్ల పెంపు, తులం బంగారం వంటి పథకాలతో పాటు అభివృద్ధి పనుల్లో జాప్యంపై నిలదీశారు. చాలా చోట్ల ఇదే పరిస్థితి కనిపించింది.
హామీల అమలెప్పుడు?
కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఎప్పుడు అమలు చేస్తారని జనం ప్రశ్నించారు. కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. కోటగిరి, మోర్తాడ్, సారంగాపూర్, ఏర్గట్ల తదితర మండలాల్లో సంక్షేమ పథకాల అమలుపై ప్రశ్నల వర్షం కురిపించారు. అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించనప్పుడు గ్రామసభలు ఎందుకని అడిగారు. రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే కార్డు రాదు.. పంట పెట్టబడి కోసం రైతు భరోసా రాదు. .బోనస్ రాదు మరీ ఇవన్నీ ఎందుకు అని మండిపడ్డారు. వంద రోజుల్లో అమలు చేస్తామన్న హామీలు ఎందుకు అమలు చేయలేదని నస్రుల్లాబాద్ గ్రామసభలో ప్రశ్నించారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని నవీపేట గ్రామసభలో డిమాండ్ చేశారు. నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలోని 13వ డివిజన్ సారంగపూర్‌లో నిర్వహించిన సభలోనూ స్థానికులు, బీఆర్ఎస్ నేతలు.. కాంగ్రెస్ హామీలపై నిలదీశారు. తాగునీటి సరఫరా, పారిశుధ్య పనుల నిర్వహణలో నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తోపులాట..
అభివృద్ధి పనుల్లో జాప్యంపై గ్రామస్తులు మండిపడ్డారు. గ్యారంటీల ఎగవేతపై ఏర్గట్ల మండలం తొర్తి గ్రామ సభలో స్థానికులు నిలదీశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను చూపుతూ.. ఎందుకు అమలు చేయడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బులు కూడా రావడం లేదని.. కాంగ్రెస్ ప్రభుత్వం ఝూటా ప్రభుత్వమని మండిపడ్డారు. తులం బంగారం ఎప్పుడిస్తారని, పింఛన్ల పెంపు ఎప్పటి నుంచి? అని నిలదీశారు. అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి చేపట్టిన అభివృద్ధి పనుల పోస్టర్లను ప్రదర్శిస్తూ.. అభివృద్ధి అంటే ఇది అని మాజీ సర్పంచ్ నవీన్, బీఆర్ఎస్ నేతలు నర్సారెడ్డి, గంగాధర్, ఈశ్వర్, భూమన్న తదితరులు అన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మొదలైన వాగ్వాదం.. తోపులాటకు దారి తీసింది.
విలీనం వద్దని ఆగ్రహం
బిచ్కుంద మున్సిపాలిటీలో కందర్పల్లి గ్రామాన్ని విలీనం చేయడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపాలిటీలో విలీనాన్ని వ్యతిరేకిస్తూ గ్రామ సభలో తీర్మానం చేశారు. విలీనం వద్దు.. మా పంచాయతీ మాకే ముద్దు అని నినాదాలు చేశారు. మున్సిపాలిటీలో విలీనం చేయాలంటే వ్యవసాయేతర పనులు ఎక్కువగా ఉండాలని, కానీ కందర్పల్లి గ్రామంలో 90 శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారని గుర్తు చేశారు.
రైతుల ఆగ్రహం..
కాంగ్రెస్ పార్టీ మోసాలపై రైతులు పలు గ్రామసభల్లో నిలదీశారు. మోర్తాడ్, కమ్మర్పల్లి, సారంగాపూర్ తదితర మండలాల్లో రుణమాఫీ, రైతు భరోసా ఎగవేతపై ప్రశ్నించారు. రెండున్నర సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ పూర్తిస్థాయిలో రుణమాఫీ ఎందుకు చేయలేదని అడిగారు. ఒక్క ఎకరానికే రైతుభరోసా డబ్బులు వేయడంపై అధికారులను నిలదీశారు. గత యాసంగిలో రావాల్సిన వరి బోనస్ ఇంకా ఎందుకు వేయలేదని అడిగారు. రుణమాఫీ రాలేదని రైతులు ప్రశ్నించగా, రాని వారు దరఖాస్తులు ఇవ్వాలని అధికారులు ముక్తసరిగా సమాధానమివ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా యాప్ విధానం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, దాన్ని రద్దు చేసి పాత పద్ధతిలోనే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. యాప్‌ను రద్దు చేయాలని కోరుతూ ఎల్లారెడ్డి మండలం వెల్లట్ల గ్రామసభలో తీర్మానం చేశారు.