Kamareddy | కామారెడ్డి : కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం నిజాంసాగర్ మండలంలోని మంగళూరు నర్సింగరావుపల్లి సబ్ స్టేషన్‌ని రైతులు శనివారం ఉదయం ముట్టడించారు. సబ్ స్టేషన్ పరిధిలోని మంగులూరు నర్సింగరావు పల్లి, వెలుగనూరు గ్రామాలకు చెందిన రైతులు సబ్ స్టేషన్‌ను ముట్టడించిన అనంతరం సంగారెడ్డి-నాందేడ్ అకోలా జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ సబ్ స్టేషన్ పరిధిలో సుమారు 4వేల ఎకరాల పంటలు ఉన్నాయని, గత ఐదు రోజులుగా ప్రతీరోజు ఐదు నుంచి ఆరు గంటలు మినహా విద్యుత్ సరఫరా చేయడం లేదని వాపోయారు. అంతేకాకుండా లో వోల్టేజీ సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, తమకు 24 గంటల విద్యుత్‌ను అందించాలని డిమాండ్ చేశారు. 17 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చి నేడు ఐదు నుంచి ఆరు గంటల మినహా ఇవ్వడం లేదంటూ మండిపడ్డారు. జాతీయ రహదారిపై బైఠాయించడంతో ఎక్కడి వాహనాలు అక్కడే బారులు తీరాయి. అనంతరం ఎస్సై శివకుమార్ రైతన్నలను సముదాయించి ధర్నాలు విరమింపజేశారు.