ఆర్మూర్టౌన్, డిసెంబర్3: ఎన్నికల్లో కాంగ్రెస్ గ్యారంటీల గారడి చేసి ప్రజలను మోసం చేసిందని ఆర్మూర్ డివిజన్ రైతు జేఏసీ నాయకులు అన్నారు. మంగళవారం వారు పట్టణంలోని కుమార్ నారాయణ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు ఇట్టెడి లింగారెడ్డి , ప్రభాకర్ మాట్లాడుతూ.. రైతు రుణమాఫీ, పంటలకు బోనస్, రైతు భరోసా పేరుతో అధికారంలోకి వచ్చిన రేవంత్రెడ్డి.. రైతులను మోసం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ వాగ్దానాలు ఎండమావిలా మారా యన్నారు.
ఒక గ్రామంలో 300 మంది రైతులు ఉంటే, అందులో కేవలం 30 మందికి మాత్రమే నాల్గో విడుత వరకు రుణమాఫీ అయినట్లు తెలిపారు. మండలంలోని మంథని గ్రామంలో ఇంకా 300 మందికిపైగా రైతుల (పదిశాతం)కు రైతు రుణమాఫీ కాలేదన్నారు. ఎన్నికల్లో ఆరు అబద్ధాలు ఆడి 66 మోసాలు చేసిందన్నారు. రైతులకు ‘భరోసా’లేదని, రైతు కూలీలకు 12వేల భృతి మాయ మాటలే అన్నారు. రెండు లక్షల రుణమాఫీ అరకొరే మందికే చేశారని తెలిపారు. వరికి రూ.500 బోనస్ ఉత్తమాటే అని పేర్కొన్నారు. ఆడబిడ్డలకు ఇప్పటికీ రూ. 2,500 అందలేదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎంతశాతం మేర అమలుచేశారో కాంగ్రెస్ పార్టీ నాయకులకే తెలుసున్నారు. త్వరలో రైతు ఆందోళన కార్యాచరణ ప్రకటించనున్నట్లు తెలిపారు.