మోర్తాడ్, జూన్ 9: వానకాలం సాగులో రైతులు బిజీబిజీగా మారారు. రుతుపవనాలు తొందరగా వస్తున్నాయన్న సమాచారంతో తొలకరి పలకరించకుండానే పసుపు, మక్కజొన్న సాగుకు సమాయత్తమవుతున్నారు. దుక్కులు దున్నడం, విత్తనాలు వేసే పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. తొలకరి కోసం రైతులు ఆకాశంవైపు చూస్తున్నారు. అయితే గతేడాదిపంటల పరిస్థితి, ధరల కారణంగా ఈ సారి పసుపు, మక్కజొన్న విస్తీర్ణం భారీగా పెరిగే అవకాశం ఉండగా, అదే స్థానంలో సోయా విస్తీర్ణం తగ్గే అవకాశం ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా పసుపునకు ధర పలకడంతో గతేడాది పసుపు పండించేందుకు విముఖత చూపిన రైతులు ప్రసుత్తం పండించేందుకు సిద్ధమవుతున్నారు. రెండేండ్లుగా సోయా పంట సాగులో దిగుబడులు సరిగా రాక నష్టపోయిన రైతులు మక్కజొన్న సాగువైపు మొగ్గుచూపుతున్నారు.
గతేడాది జిల్లా వ్యాప్తంగా 19,047 ఎకరాల్లో పసుపు పంటను పండించిన రైతులు ఈసారి 25వేల ఎకరాల్లో సాగుచేసే అవకాశం ఉన్నదని వ్యవసాయ, హార్టికల్చర్ అధికారులు అంచనా వేస్తున్నారు. 30వేల ఎకరాలకు వెళ్లినా ఆశ్చర్యపోనవసరం లేదన్న అభిప్రాయా లూ వ్యక్తమవుతున్నాయి. దీనికి కారణం గతంలో ఎన్నడూలేని విధంగా పసుపునకు రూ.20వేలకు పైగా ధర రావడమేనని తెలుస్తోంది. ఆశించిన ధర రావడం తో ఈసారి రైతులు పసుపు పండించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో గతేడా ది పసుపుపై ఆసక్తిచూపని వారు ప్రస్తుతం విత్తన పసుపులేక ఇబ్బందులు పడుతున్నారు. విత్తన పసుపు ఉన్న రైతులు విస్తీర్ణాన్ని పెంచుకునే అవకాశం ఉండడం, విత్తన పసుపును రైతులు లక్ష్మీగా భావించడం కారణంగా విత్తనం పసుపు లేని రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. విత్తనం పసుపుకోనేందుకు సిద్ధమవుతున్నప్పటికీ అమ్మేవారు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. ఒకవేళ అమ్మే రైతు దొరికినా డిమాండ్ కారణంగా ధర విపరీతంగా పెట్టాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. మంచి ధర లభించడం కారణంగానే పసుపు పండించాలనుకుంటున్నామని రైతులు చెబుతున్నారు.
నిజామాబాద్ జిల్లాలో గతేడాది 42,043 ఎకరాల్లో మక్కజొన్న, 51579 ఎకరాల్లో సోయాపంటను రైతులు పండించగా.. ఈసారి మక్కజొన్న విస్తీర్ణం విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే మక్కజొన్న పంటను దాదాపు రెండువేల ఎకరాల్లో రైతులు విత్తుకున్నారు. రెండేండ్లుగా సోయావేసిన రైతులు తెగుళ్ల కారణంగా దిగుబడి రాక రైతులు నష్టపోయారు. ఎకరానికి 10 నుంచి 14క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా కేవలం 50కిలోల నుంచి రెండు క్వింటాళ్ల వరకే వచ్చింది. దీని కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. సోయా పంట దిగుబడి తగ్గినా ధరలో మార్పు లేకపోవడం కూడా రైతులను వేధించింది. అదే మక్కజొన్న పండించిన రైతులకు దిగుబడి రావడంతోపాటు ధర కూడా ఆశించినస్థాయి వచ్చింది. దీంతో ఈసారి వానకాలంలో మక్కజొన్న పండించేందుకు రైతులు మొగ్గుచూపుతున్నారు. ఈకారణంగా జిల్లాలో ఈసారి పసుపు, మక్కజొన్న విస్తీర్ణం భారీగానే పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు గతేడాది అనుభవ పాఠాలతో రైతులు పంటలు పండించేందుకు సిద్ధమవుతుండగా ఇప్పటి వరకు తొలకరి పలకరించకపోవడంతో ఆకాశం వైపు చూస్తున్నారు. వానలు బాగా కురిసి పంటలు బాగా పండి మంచి ధరలు పొందాలనే ఆశలతో రైతన్న సాగుపనులు ప్రారంభించాడు.
నిరుడు అర ఎకరంలోనే పసుపు పంట వేయగా ధర బాగా వచ్చింది. ఇప్పుడు నాదగ్గర ఉన్న విత్తనంతోనే ఎకరంలో పసుపు పంట వేసిన. పసుపు విత్తనం ఉంటే ఇంకా ఎక్కువగా పసుపు పండించేవాన్ని. పసుపు విత్తనాన్ని లక్ష్మీగా కొలుస్తారు కాబట్టి మార్కెట్లో కొందామన్నా పసుపు విత్తనం దొరకదు. ఒకవేళ ఎవరైనా అమ్మినా ఈసారి పసుపునకు ధర ఎక్కువగా రావడం కారణంగా విత్తనాలకు కూడా ధర విపరీతంగా పెట్టాల్సి వస్తున్నది. గతేడాది పసుపు పండించని వారు విత్తనాల కోసం ఇబ్బందులు పడుతున్నారు.
సోయా పంట పండించినా తెగుళ్ల కారణంగా దిగుబడులు రాక నష్టపోయినం. అందుకే ఇప్పుడు మక్కజొన్న పంటను సాగుచేద్దామనుకుంటున్నం. ఎకరానికి సోయాలో దిగుబడి రెండు క్వింటాళ్లు కూడా దాటలేదు. కష్టపడి నష్టపోయే బదులు మక్కజొన్న పండించాలని అనుకుంటున్నాం. మక్కజొన్న పండించడంవల్ల దిగుబడులు రావడంతోపాటు ధర కూడా భారీగా తగ్గడం అంటూ ఉండదు. నష్టపోయే అవకాశాలు ఉండవు . అందుకే మక్కజొన్న పంటను పండిస్తున్నాం.