నిజామాబాద్, మే 4, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బీఆర్ఎస్ పార్టీ మరో పోరుబాటకు సిద్ధమైంది. రైతుల కోసం మేమున్నామంటూ ముందుకు కదులుతోంది. రెండున్నరేళ్ల కాంగ్రెస్ పార్టీ పాలనలో రైతుకు కంట కన్నీరు తప్పా ఏమీ మిగలడం లేదు. ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోవడం లేదు. వరంగల్‌లో రైతు డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇష్టమొచ్చిన హామీలను ఇచ్చింది. పదుల సంఖ్యలో హామీలు గుప్పించి అధికారంలోకి రాగానే అన్నింటినీ పక్కన పెట్టేసింది. కేసీఆర్ తీసుకు వచ్చిన పెట్టుబడి సాయం పథకం రైతుబంధుకు బదులుగా రైతుభరోసాను తెస్తామని చెప్పారు. ఎకరాకు రూ.10వేలకు బదులుగా రూ.15వేలు ఇస్తామన్నారు. రూ.12వేలకు కోత పెట్టి అరకొరగా అమలు చేస్తున్నారు.
యాసంగికి పూర్తి స్థాయిలో పెట్టుబడి సాయం అందలేదు. వడ్ల కొనుగోళ్లు జోరుగా సాగడం లేదు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని మద్దతు ధర చెల్లింపుల్లోనూ జాప్యం వెలుగు చూస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుకు అనేక అవస్థలు ఎదురవుతుండడంతో కాంగ్రెస్ పాలకుల తీరును నిరసిస్తూ రైతులకు బాసటగా భారత రాష్ట్ర సమితి నిలిచింది. ఇందులో భాగంగానే ప్రజాస్వామ్యబద్ధంగా రేవంత్ రెడ్డి సర్కార్ బండారాన్ని బట్టబయలు చేసి రైతుల ముందు దోషిగా నిలబెట్టేందుకు గులాబీ పార్టీ సిద్ధమైంది. రైతు డిక్లరేషన్ పేరుతో ఆర్భాటంగా హామీలిచ్చి మొఖం చాటేయడంపై బీఆర్ఎస్ పార్టీ కర్షకులతో కలిసి సభను వరంగల్‌లో రైతు సదస్సు పేరుతో నిర్వహిస్తోంది.
రోడ్డు ఎక్కుతోన్న రైతన్నలు..
కేసీఆర్ పాలనలో రైతులకు సర్వం లాభం జరిగింది. పంట కాలం మొదలవ్వగానే ఠంచనుగా రైతుబంధు సాయం వారి బ్యాంక్ అకౌంట్లలో జమ అయ్యేది. ఎరువులు, విత్తనాలు సకాలంలో చేతికి అందేది. సాగు నీళ్లు కాలానికి అతీతంగా అందుబాటులో ఉండేది. నిరంతరం 24గంటల కరెంట్ అందింది. పంట కోతకు వచ్చిన వెంటనే కొనుగోలు కేంద్రాలు నెలకొల్పేది. ధాన్యం సేకరించిన 48 గంటల్లోనే వారి అకౌంట్లో ధాన్యం డబ్బులు జమ అయ్యేవి. ఇలా క్రమానుగతంగా జరిగిన కార్యక్రమాలేవీ కాంగ్రెస్ సర్కారులో పత్తా లేకుండా పోయాయి. ప్రస్తుతం యాసంగి సీజన్‌కు రెండు ఎకరాలకు మాత్రమే రైతు భరోసా సాయం అందింది. చిన్న, సన్నకారు రైతులు లక్షలాది మందికి 5ఎకరాల్లోపు వ్యవసాయం ఉంది.
వీరికి పూర్తి స్థాయిలో పెట్టుబడి సాయం రాలేదు. ధాన్యాన్ని అమ్ముకునేందుకు సిద్ధపడిన రైతులకు రోజుల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. విక్రయించిన ధాన్యానికి సంబంధించిన డబ్బులు చెల్లింపులో జాప్యం జరుగుతోంది. రైతుల అకౌంట్లలో వారం రోజులకు పడుతోంది. కడ్తా పేరుతో రైస్ మిల్లర్లు దోపిడీ చేస్తున్నారు. ఇదంతా వెరసి రైతులకు ఇక్కట్లు తప్పకపోవడంతో ఎక్కడికక్కడ రోడ్డు ఎక్కి నిరసన బాట పడుతున్నారు. ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే రైతులకు సకల సౌకర్యాలు కల్పించబడ్డాయని చెబుతున్నారు. రేవంత్ పాలనలో రైతులకు దిక్కూమొక్కూ లేకుండా పోయిందని వాపోతున్నారు.
త్వరలోనే బీసీ సభ…?
డిక్లరేషన్ల పేరిట ఎడాపెడా సభలు పెట్టి కాంగ్రెస్ పార్టీ కోకొల్లలుగా హామీలు ఇచ్చింది. ప్రజలంతా ఈ హామీలను నమ్మి కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని అప్పగించారు. రెండున్నరేండ్లుగా దాటినప్పటికీ డిక్లరేషన్ పేరిట ఇచ్చిన హామీల్లో ఏవీ అమలుకు నోచుకోలేదు. ప్రజలను వంచిస్తోన్న కాంగ్రెస్ ప్రభుత్వం తీరుకు నిరసనగా నిలదీతల పర్వానికి బీఆర్ఎస్ శ్రీకారం చుట్టింది. రైతు డిక్లరేషన్ పేరుతో వరంగల్‌లో సభ పెట్టి రైతులను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి అదే స్థాయిలో బుద్ధి చెప్పేందుకు గులాబీ పార్టీ సిద్ధమైంది. వరంగల్‌లోనే రైతు సభను మే 6న నిర్వహిస్తోంది. రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఎన్ని? అందులో అమలైనవి ఎన్ని? ఏ మేరకు రైతులకు సత్ఫలితాలు వచ్చాయో ఇందులో చర్చిస్తారు. బీఆర్ఎస్ రైతు సభతో అధికార పార్టీలో వణుకు మొదలైంది.
జగిత్యాలలో కేసీఆర్ సభకు పోటీగా మేడిగడ్డలో సీఎం రేవంత్ రెడ్డి సభను పెట్టి అట్టర్ ఫ్లాప్ అయ్యారు. అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం రాలేదని రైతులు మండిపడుతున్నారు. బీఆర్ఎస్ నిర్వహించే ప్రతి కార్యక్రమాన్ని పరోక్షంగా అడ్డుతగిలేందుకు ఏదో ఒక కార్యక్రమాన్ని పెట్టి పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. వరంగల్ రైతు సభకు ఏర్పాట్లు జరుగుతుండడంతో పోటాపోటీగా రైతు వారం పేరుతో కార్యక్రమాలు నిర్వహించేందుకు హడావిడిగా ప్రభుత్వం ప్రకటన చేసింది. ఎన్ని కుట్రలకు పాల్పడినప్పటికీ జగిత్యాల సభ విజయవంతం కావడంతో అదే స్ఫూర్తితో బీఆర్ఎస్ వరుస కార్యక్రమాలు చేపట్టబోతోంది. కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ గతంలో బీసీ డిక్లరేషన్ సభను నిర్వహించింది. బీసీలకు రేవంత్ సర్కార్ చేసిన దగాపై బీఆర్ఎస్ బీసీ సభ సైతం నిర్వహించనున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.