రైతులందరికీ రూ.2 లక్షల లోపు మాఫీ చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టాక ఆంక్షల కొరడా ఝళిపించింది. సవాలక్ష కొర్రీలతో సగం మంది రైతులకు రిక్త‘హస్తం’ చూపింది. ఏ గ్రామానికి వెళ్లినా, ఏ రైతును పలుకరించినా రుణమాఫీ కాలేదన్న ఆవేదననే వినిపిస్తున్నది. సర్కారు సాయం దక్కలేదన్న ఆందోళననే అన్నదాతల్లో కనిపిస్తున్నది. సాంకేతిక సమస్యలో.. సర్కారీ కొర్రీలో కానీ కర్షకుల ఉసురు పోసుకుంటున్నారు.
– ఏర్గట్ల/కోటగిరి/పోతంగల్, ఆగస్టు 20
ఏర్గట్ల, ఆగస్టు 19: నా పేరిట లక్ష రూపాయల రుణం ఉన్నది. సీఎం రేవంత్‌రెడ్డి పంద్రాగస్టులోపు రుణం మాఫీ చేస్తా అనే. కానీ ఇప్పటిదాకా నాకు రుణమాఫీ కాలేదు. అధికారులను అడిగితే నా బ్యాంక్ అకౌంట్‌కు వేరే వాళ్ల ఆధార్ కార్డు లింకు అయి ఉందని చెప్తున్నారు. నా సమస్యను పరిష్కరించి, రుణమాఫీ చేయాలి.
– భూషణవేణి గంగాధర్ యాదవ్, రైతు, బట్టాపూర్
బ్యాంకులో నాకు రెండు లక్షల ఎనభై వేల రుణం ఉన్నది. నేను బ్యాంకు రుణం విషయంలో క్లియర్‌గా ఉంటా. కానీ నేను తీసుకున్న రుణం మాత్రం మాఫీ కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం మా రుణాలు మాఫీ చేసి ఆదుకోవాలి. లేకపోతే రైతలమంతా కలిసి ఆందోళన చేస్తాం.
– నాగిరెడ్డి రాజేందర్‌రెడ్డి, రైతు, దోంచంద
పొతంగల్, ఆగస్టు 19 : 2018లో రూ. 17 వేల క్రాప్‌లోన్ తీసుకున్న. ప్రతి ఏడాది రెన్యువల్ చేసుకుంటా వస్తున్న. రుణ మాఫీ చేసిండ్లని తెల్వగానే సంతోషపడ్డా. కానీ లిస్టుల చూస్తే నా పేరు లేదు. అధికారులను అడిగితే తర్వాతి లిస్టుల్లో వస్తదన్నరు. రెండో లిస్టుల, మూడో లిస్టుల కూడా నాపేరు లేదు. ఎవరిని అడగాలో అర్థమైతలేదు.
– కొడిచర్ల చిన్న సాయిలు, రైతు, కల్లూర్
ఎత్తొండ బ్యాంకులో రూ. లక్ష ఐదు వేల పంట రుణం తీసుకున్నా. ఆధార్ కార్డు, పాస్ పుస్తకంలో నా పేరు, తండ్రి పేరు అన్ని కరెక్ట్‌గా ఉన్నాయి. అయినా నాకు క్రాప్ లోన్ మాఫీ కాలేదు. ఏ అధికారిని అడిగినా సరైనా సమాధానం ఇవ్వడం లేదు. వస్తది అని చెబుతున్నారు. ఎప్పుడు అస్తదో ఏమో అర్థం కావడం లేదు.
బ్యాంకులో లక్ష రూపాయల వరకు అప్పు తీసుకున్నా. రాష్ట్ర ప్రభుత్వం రుణ మాఫీ చేసిందని తెలియగానే లిస్టులో చూసుకుంటే నా పేరు రాలేదు. అధికారులను కలిసి సమస్య ఏందని తెలుసుకున్నా. నా పేరులో ఏదో తప్పు జరిగిందని చెప్పినారు. కానీ ఇంతకుముందు ఎప్పుడూ ఇలా కాలేదు. తప్పును సరి చేసి నాకు రుణ మాఫీ చేయాలి.
– మాదస్తు మహేశ్ యాదవ్, రైతు, తడ్పాకల్