ఖలీల్వాడి : నిజామాబాద్లో జరుగనున్న తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం( Rythu Sangham) మహాసభలను జయప్రదం చేయాలని రైతు సంఘం రాష్ట్ర నాయకులు కంజర భూమయ్య పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సీపీఐ( CPI ) కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతాంగానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 3 నల్ల చట్టాలను రద్దు చేయాలని, నిజామాబాద్ జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన పసుపు బోర్డుకు( Haldi Board ) నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.
స్వామినాథన్ సిఫారసు ప్రకారం రైతాంగం పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలన్నారు. మార్చి 25, 26, 27 తేదీల్లో నిజామాబాద్ మాధవ నగర్లోని బీఎల్ఎన్ గార్డెన్స్ లో నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మూడవ మాసభలను జిల్లా రైతాంగం, ప్రజలు విజయవంతం చేయాలని కోరారు.
మహాసభలో మొదటిరోజు ప్రదర్శన, బహిరంగ సభ ఉంటుందని వివరించారు. సమావేశంలో ఆహ్వాన సంఘం ఉపాధ్యక్షులు పి.సుధాకర్, కార్యదర్శులు పి.ముత్యాలు, పి.రంజిత్ , ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి అడ్డికే రాజేశ్వర్ పాల్గొన్నారు.