బిచ్కుంద/మాచారెడ్డి, జూలై 16: విద్యుత్ సమస్య పరిష్కరించాలని కోరుతూ రైతులు ఆందోళన చేపట్టారు. వ్యవసాయానికి త్రీఫేజ్ విద్యుత్ సరఫరా చేయాలని కోరుతూ బిచ్కుంద, పెద్ద కొడప్గల్ మండలాల పరిధిలోని శాంతాపూర్, జగన్నాథ్‌పల్లి, తక్కడ్‌పల్లి, సీతారాం పల్లి, రాజాపూర్, తుప్దాల్ గ్రామాల రైతులు గురువారం శాంతాపూర్ సబ్‌స్టేషన్ వద్ద ధర్నాచేపట్టారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. కొంత కాలంగా వ్యవసాయ బోరుమోటర్లకు త్రీఫేజ్ విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతోపాటు తరచూ విద్యుత్ సరఫరాలో అంతరాయం, లోవోల్టేజ్ సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. దీంతో పంటలకు సకాలంలో నీరందించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. పంటలకు నీరు లేక ఎండిపోవడంతో ఆర్థిక నష్టం వాటిల్లు తున్నదని పేర్కొన్నారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు.
పల్వంచమండలంలోని ఫరీద్‌పేట గ్రామంలో ఉన్న సబ్‌స్టేషన్‌ను రైతులు ముట్టడించారు. ప్రభుత్వం 24 గంటలు వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు చెబుతూ.. పట్టుమని పదిగంటలు కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. విద్యుత్ లేక వరి నారుమళ్లు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఈవిషయమై ఏల్పుగొండ ఏఈ జ్యోతిని సంప్రదించగా వరంగల్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేస్తున్నామని తెలిపారు.