పూటకో మాట మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతల అసలు రంగు బయటపడింది. పదేండ్లలో పచ్చబడ్డ తెలంగాణను.. రైతుల ముఖాల్లోని నవ్వును దూరం చేసే కుట్రలు బహిర్గతం అయ్యాయి. అధికారం దక్కించుకోవాలనే అత్యాశతో నోటికి ఏది వస్తే.. అది మాట్లాడుతూ అన్నదాతలను ఆగం చేయాలని చూస్తున్నారు. ఎవుసం ఎరుకలేని నాయకులంతా కలిసి రైతుకు కొత్తగా వ్యవసాయ పాఠాలు బోధించేలా ఉన్నారు. పొలానికి నీళ్లు పారించాలంటే మూడు గంటల కరెంటు సరిపోతుందని రైతులపై ఉన్న అక్కసును టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వెళ్లగక్కారు. అది సాధ్యం కాదని తెలుసుకొని, 10హెచ్‌పీ మోటర్లు పెట్టుకోవాలని రైతులకు మరో ఉచిత సలహా ఇచ్చారు. అసలు మూడు గంటల కరెంటు రైతులకు సరిపోతుందా? 10హెచ్‌పీ మోటర్లు వ్యవసాయ బోర్లకు వాడతారా? అనే విషయం ఆయనకు ఇసుమంతైనా తెలుసా? అని రైతన్నలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కాంగ్రెస్‌కు తప్పిదారి ఓటేస్తే రైతులను ఆగం చేసేలా ఉన్నాయి ఆ నాయకుల మాటలు. ఇదంతా గమనిస్తున్న రైతాంగం.. కాంగ్రెసోళ్లకు ఓటేసేదీ లేదు.. వాళ్లకు అధికారం ఇచ్చేదీ లేదని అభిప్రాయపడుతున్నారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో బీడుభూములన్నీ పచ్చగా
24గంటల ఉచిత కరెంటు. వ్యవసాయం బాగైంది.. రైతు కూడా బాగుపడుతున్నాడు. దీనంతటికీ సీఎం కేసీఆర్ తీసుకున్న విప్లవాత్మక చర్యలేనని రైతులు సంతోషంగా చెబుతున్నారు. రైతులకు ఎన్నో సౌలత్లు ఇచ్చిన కేసీఆర్‌ను కాదని వేరే పార్టీకి ఓటు వెయ్యబోమని తేల్చిచెబుతున్నారు. ఆగం కాకుండా.. సీఎం కేసీఆర్‌కు ఓటేసి రైతు రాజ్యానికి పాటుపడతామని ప్రతినబూనారు.

24 గంటల రెంటుతో హాయిగా వ్యవసాయం చేసుకుంటే రేవంత్ రెడ్డి కండ్లు మండుతున్నయ్. 3 గంటల కరెంటు ఇచ్చి రైతులను ఆగం చేసి ఏం పొదుపు చేస్తాడో. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కరెంటు ఇవ్వలేదు. కేసీఆర్ మంచిగా కరెంటు ఇస్తుంటే ఓరుస్తలేడు. మళ్లీ ఒక్క చాన్స్ ఇస్తే ఉన్న కరెంటును కూడా ఊడ పీకుతామంటున్నరు. ఇలాంటి దిక్కుమాలిన ప్రతిపాదనలతో వస్తున్న రేవంత్‌రెడ్డి.. ఎన్నికల్లో డక్కవుట్ ఖాయం. రైతుల కష్టాలను తెలుసుకోకుండా కరెంటు, మోటర్లు, పంటలమీద మాట్లాడుతున్నడు. తిక్కతిక్క వేషాలేస్తే.. కాంగ్రెస్ నుంచి ఒక్కడంటే ఒక్కడు కూడా గెల్వడు. 50 ఏండ్లు ఎన్ని బాధలు పెట్టారు. రైతులకు అవన్నీ గుర్తున్నయ్. ఒక్కరైనా కాంగ్రెస్‌కు ఓటేస్తరా? కష్టాలు కొని తెచ్చుకుంటరా? 24 గంటల కరెంట్ ఇచ్చే కేసీఆర్‌ను వదులుకుంటరా?
చిన్నప్పటి నుంచి మా కుటుంబ సభ్యులతో కలిసి పొలం పనికి పోతున్న. అప్పుడు మా నాన్న రాత్రిపూట మమ్మల్ని వదిలి నీళ్లు పారియ్యడానికి పొలానికి పోతుండె. నేను బడి నుంచి వచ్చినంక కూడా ఒక్కోసారి నాన్నతోని పొలానికి పోయెటోన్ని. కరెంటు కోసం ఎదురుచూస్తుంటిమి. ఒక్కోసారి కరెంటు రాకుండె. నా చిన్నప్పటి బాధలు ఇంకా గుర్తున్నయ్. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే ఉండె. ఈ పదేండ్ల నుంచే కేసీఆర్ సర్కారు మంచి కరెంటు ఇస్తున్నది. ఇప్పుడిప్పుడే బాధలు తప్పినయ్ అనుకుంటే మళ్లీ కాంగ్రెస్ నాయకులు వచ్చి 3 గంటల కరెంటు ఇస్తమంటున్నరు. 10 హెచ్‌పీ మోటర్లు పెట్టుకోమంటున్నరు. లక్షలకు లక్షల పెట్టుబడి పెట్టుమంటున్నరు. కాంగ్రెస్ వస్తే రైతుల మీదనే పడ్తరు. మంచిగ బతుకుతుంటే ఓరుస్తలేరు. కాంగ్రెస్ సర్కారుతో మళ్లీ నా చిన్నప్పటి కష్టాలు తప్పవు. బతుకుతమా.. సస్తమా? తెలుస్తలేదు.
ఎవుసం గురించి రేవంత్‌రెడ్డికి ఏమన్నా తెలుసా? మూడు గంటల కరెంటు సరిపోతదా? ఏమన్నా అంటే 10 ఎస్పర్ మోటర్లు పెట్టుకోమంటడు. అసలు రేవంత్.. తెలివి ఉండే మాట్లాడుతున్నడా? అంత పెద్ద మోటర్ పెట్టాలంటే ఎంత పెట్టుబడి గావాలె. ఇప్పుడేసుకున్న బోర్లు సరిపోతయా? పైపులు సరిపోతయా? పెట్టుబడి ఎవడియ్యాలె. గీ పదేండ్లు రంది లేకుంట పంటలేసుకున్నం. కాంగ్రెసోళ్లు వస్తే మళ్లా మేము నిండా ముగునుడే. రేవంత్‌కు కొంచెం కూడా జ్ఞానం లేదు.
పొలానికి నీళ్లు పెట్టాలంటే ఎన్ని గంటల కరెంటు కావాలో మాకే నేర్పిస్తున్నడు రేవంత్‌రెడ్డి. అప్పట్లో కాంగ్రెస్ గవర్నమెంటు ఎంజేసింది.. ఎన్ని కష్టాలు పెట్టింది.. నీళ్లియ్యలే.. కరెంటియ్యలే.. ఎరువులియ్యలే. ఒక్క పంట తీయాలంటే అష్టకష్టాలు పడ్డం. అంతా అయ్యాక.. రూపాయి కూడా చేతికి రాకుండె. అన్నీ అప్పులే మిగిలేవి. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినంక సీఎం కేసీఆర్ రైతులను బాగా కాపాడుకుంటున్నడు. 24 గంటల ఫ్రీ కరెంటు ఇస్తున్నడు. నీళ్లిస్తున్నడు. పెట్టుబడి ఇస్తున్నడు. పంటలు కొంటున్నడు. రైతులు సంబురంగా పంటలు పండిస్తున్నరు. ఇవన్నీ వదిలేసి.. మళ్లీ కాంగ్రెస్‌ను గెలిపిస్తే.. 3 గంటల కరెంటుతోని మూడు చెరువుల నీళ్లు తాగిస్తురు. మా నెత్తిమీద 10 ఎస్పర్ల మోటర్లు పెడ్తమంటే ఊరుకుంటమా.. రేవంత్‌ను, ఆయన పార్టీని బొందవెడ్తం.
మూడు గంటల కరెంటు అంటుండ్రు.. 10 ఎస్పర్ మోటర్లు అంటుండ్రు.. కొత్త కొత్త ఫార్ములాలు చెప్తున్నరు. రైతులను పిచ్చోళ్లను చేస్తున్నరా? మేం బతకాల్నా వద్దా? కాంగ్రెసోళ్లు కర్ణాటకలో ఏం జేసిండ్రు.. ఓట్లేయించుకున్నరు. ఇప్పుడు రైతులను తిప్పలు పెడుతున్నరు. 5 గంటలే కరెంటు ఇస్తున్నరంట. మరి అక్కడెందుకు 10 ఎస్పర్ మోటర్లు పెట్టలేదు. ఇసుంటి దండుగమల్ల ఫార్ములాలను ఫస్టు కర్ణాటకల పెట్టి చూపుండ్రి. కాంగ్రెస్ నాయకుల మాటలు విని.. మంచిగున్న బతుకులకు కష్టాలు కొనితెచ్చుకోం..
కాంగ్రెస్ నాయకుడు రేవంత్‌రెడ్డిది వ్యవసాయ తిరోగమన విజన్. ఆయన మాటలు, సూచనలు పాటిస్తే రైతు బోల్తా పడుడు ఖాయం. 3 గంటల కరెంటిచ్చి.. 10 హార్స్ పవర్ మోటర్లు పెట్టుకోమంటే ఎట్లా? డబ్బులు ఎవరియ్యాలె? చిన్న రైతులతోని అయితదా? పెద్ద మోటర్లు పెడితే లో వోల్టేజీ సమస్యలు రావా? భూమిలో చుక్క నీరుండది. ఇప్పుడున్న సర్కారు రైతులకు 24గంటలపాటు నాణ్యమైన ఫ్రీ కరెంట్ ఇస్తున్నది. చెరువులు బాగైనయ్.. పుష్కలంగా నీళ్లు కూడా ఉన్నయ్. పంటలు పండించాలంటే రైతులకు ఇంతకన్నా ఏం గావాలె. కాంగ్రెస్‌ను, రేవంత్‌రెడ్డి మాటలను నమ్మి బొందలో పడదామా? లేదంటే మళ్లీ బీఆర్ఎస్ను గెలిపించుకొని సంతోషంగా ఉందామా రైతులు తేల్చుకోవాలె.
కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 3 గంటల కరెంటు ఇస్తామని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అంటున్నడు. కరెంటు సరిపోకపోతే 10 హెచ్‌పీ మోటర్లు పెట్టుకోవాలంట. అంత పెద్ద మోటర్లు ఊరంతా పెడ్తే ట్రాన్స్ఫార్మర్లు ఉంటయా? సబ్స్టేషన్లు పనిచేస్తయా? ఉన్న కరెంటు కూడా గోవింద.. భూమిల నీళ్లు గోవింద.. తాగడానికి కూడా చుక్క నీళ్లుండయ్. కరెంటు సరిగా లేక.. నీళ్లూ లేక జనం ఎట్లా బతకాలె. ఇలాంటి ఫార్ములాలు ప్రజలను, రైతులను గందరగోళంలో పడేస్తాయి. ఇప్పుడున్న 24 గంటల కరెంటు చాలా బాగుంది. రైతులు ఎలాంటి బాధ లేకుండా పంటలను హాయిగా సాగు చేసుకుంటున్నరు. కాంగ్రెస్ గెలిస్తే మళ్లీ పాత కష్టాలన్నీ చూడాల్సిందే. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటేనే రైతులకు మేలు జరుగుతుంది.
కాంగ్రెస్ పార్టీ 50 ఏండ్లు పాలించింది. ఎన్నడైనా రైతుల కష్టాలను పట్టించుకున్నదా? కరెంటు కావాల్నా.. నీళ్లు కావాల్నా.. అని అడిగిన నాయకుడున్నడా? పంటలకు నీళ్లు పెట్టేందుకు జాగరం చేసెటోళ్లం. పాములు.. తేళ్లతో సావాసం చేసినం. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతుండె. మోటర్లు కాలిపోతుండె. రిపేర్ కోసం వానికి పైసలిచ్చుడు.. వీనికి పైసలిచ్చుడు.. అవన్నీ ఇంకా మర్చిపోలేదు. ఇప్పుడు మళ్లీ రైతులకు 3 గంటల కరెంటుతో షాక్ ఇస్తామంటున్నరు. మా నెత్తిమీద 10 ఎస్పర్ మోటర్లు పెడ్తానంటున్నరు. కేసీఆర్ వచ్చినంక అంతటా సబ్స్టేషన్లు పెట్టిండ్రు. 24 గంటల కరెంటు ఇస్తున్నది. రైతు ఇంకే గావాలె.. బీఆర్ఎస్సే రావాలె.
రేవంతం మాటలింటే ఇగ ఎవుసం ఇడుసుడే.. ఒక్కటన్నా సక్కగ చెప్తున్నడా? ఎవుసం గురించి తెలిసినోడు గట్లనే మాట్లాడుతాడా? 3 గంటల కరెంటుతోని ఏ పొలం పారిస్తం. ఇది రైతులను మోసం చేసుడు కాదా? దస్ ఎస్పర్ మోటర్లు పెట్టుకోవాల్నంట.. రేవంత్‌కు రైతులు బాగుండాలని లేదు. అందుకే తప్పుడు మాటలోని తప్పుదోవ పట్టించాలని చూస్తుండు. ఇప్పటికే కాంగ్రెస్ సర్కారుతో చాలా కష్టాలు చూసినం. ఇప్పుడున్న కరెంటు చాలా బాగుంది. మాకు నచ్చినప్పుడు పొలానికి పోయి నీళ్లు పారిస్తున్నం. కరెంటు పోతదని రంది లేదు. 3 గంటల కరెంటిస్తే ఎప్పుడస్తదో.. ఎప్పుడు పోతదో తెల్వదు. ట్రాన్స్ఫార్మర్లు కాలుడు.. మోటర్లు కాలిపోవుడు ఉంటది. 24 గంటల కరెంటు పాడు చేసుకుంటమా.. సీఎం కేసీఆర్ సర్కారు రైతులను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటున్నది. బరాబర్ ఆయననే మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుంటం. కాంగ్రెస్‌ను దగ్గరికి కూడా రానియ్యం.
తెలంగాణ సర్కారు వచ్చినంక సీఎం కేసీఆర్ సారు రైతుల కోసం చాలా చేస్తున్నడు. ఫ్రీగా 24 గంటల కరెంటు ఇస్తుండు. మాకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు తోటకు, పొలానికి పోయి నీళ్లు పారిస్తున్నం. ఒక్కరోజు కూడా కరెంటు పోతదనే రంది లేదు. రేవంత్ రెడ్డి వచ్చి రైతులకు మూడు గంటల కరెంటు సరిపోతది అంటున్నడు. కాంగ్రెస్ పార్టీ మళ్లీ పాత రోజులు తేవాలని చూస్తున్నది. పెండ్లాం పిల్లలను వదిలి రైతులు పొద్దూమాపు పొలాల్లోనే ఉండాల్సిన పరిస్థితి వస్తది. ఒకట్రెండు ఎకారాలు కూడా సాగు చేసుడు కాదు. భూమి ఎక్కువగా ఉంటే మొత్తం పడీత్ పెట్టుకోవాలె. కాంగ్రెస్ పార్టీని గెలిపించి గోసలు తెచ్చుకునుడు ఎందుకు? రైతులు సంతోషంగా ఉండాలంటే కేసీఆర్‌నే ముఖ్యమంత్రిని చేసుకోవాలె.
పంటలకు నీళ్లు పారించాలటే మూడు గంటల కరెంటు సరిపోతది.. దస్ ఎస్పర్ మోటర్లు పెట్టుకోవాలె.. అని ఏదేదో చెపుండు. రైవంత్రెడ్డికి ఏమన్నా దిమాక్ ఉన్నదా? 10 ఎస్పర్ మోటర్ పెట్టాలంటే బోర్లల్ల నీళ్లు ఉండాల్నా.. వద్దా ? గాలికి మాటలు చెప్తే సరిపోతదా? ఒక్కరు మోటరు పెట్టుకొని నీళ్లు పారిస్తే.. చుట్టుపక్కల వేరే బోర్లల్ల నీళ్లన్నీ గుంజేస్తది. త్రీ ఫేజ్ కరెంటు కావాలె. ఇప్పుడున్న కరెంటుతోని 10 ఎస్పర్ మోటర్లు నడిపిస్తే ట్రాన్స్ఫార్మర్లు ఉంటయా.. టపాటపా పేలిపోతయ్.. మోటర్లు కూడా కాలిపోతయ్.. మోటర్లు కొనుడు.. రిపేర్లు చేయించుడు.. తడిసి మోపెడైతది. సమయానికి నీళ్లందక పొలాలన్నీ ఎండిపోతయ్.. రైతులు సావుకు దగ్గరైతరు. కాంగ్రెస్ గవర్నమెంట్‌ను.. ఇవన్నీ తల్చుకుంటేనే కండ్లెంబడి నీళ్లస్తున్నయ్.