మోర్తాడ్, సెప్టెంబర్ 14: పసుపుబోర్డు ఉద్యమకారుడు, రైతు నాయకుడు ముత్యాల మనోహర్‌రెడ్డి (75) శనివారం అనారోగ్యంతో కన్నుమూశారు. మోర్తాడ్ మండలం పాలెం గ్రామానికి చెందిన ఆయన పసుపుబోర్డు కోసం దశాబ్దాలుగా పోరాటం కొనసాగించారు. చివరకు ఆయన సుదీర్ఘ కల అయిన టర్మరిక్ బోర్డు స్థాపనను చూడకుండానే మృతి చెందారు. తొలి నుంచి రైతు, ప్రజా సమస్యలపై పోరాట పంథాను ఎంచుకున్న మనోహర్‌రెడ్డి పాలెం గ్రామ సర్పంచ్‌గా సేవలందించారు.
ఆ తర్వాత ప్రధానంగా రైతు సమస్యలపైనే ఉద్యమించడం ప్రారంభించారు. ఒకప్పుడు అన్నదాతలకు సిరులు కురిపించిన పసుపు పంటకు గిట్టుబాట ధర దక్కకపోగా నష్టాలు తెచ్చిపెడుతుండడం చూసి కలవరపాటుకు గురైన మనోహర్‌రెడ్డి.. పసుపుబోర్డుతోనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని భావించారు. అందుకోసం దశాబ్దాలుగా పోరాటం చేశారు. బోర్డు వచ్చే వరకూ చెప్పులు వేసుకోనని శపథం చేసిన ఆయన ఆ మాట మీదే నిలబడ్డారు. అలాగే, తిరుపతి వరకు పాదయాత్ర చేశారు.
పసుపుబోర్డు కోసం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జరిగిన ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మరోవైపు, ఎర్రజొన్నల బకాయిల విషయంలో రైతుల ఆందోళనలను ముందుండి నడిపించారు. కేంద్ర ప్రభుత్వం పసుపుబోర్డు ఇస్తామని ప్రకటన చేయగానే చెప్పులు వేసుకోవడం ప్రారంభించిన మనోహర్‌రెడ్డి.. బోర్డు స్థాపన, కార్యకలాపాలను కళ్లారా చూడకుండానే కన్నుమూశారు. కేంద్ర ప్రభుత్వ జాప్యం వల్లే ఆయన సుదీర్ఘ కల నెరవేరకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.