ధర్పల్లి, ఆగస్టు 31: యూరియా కోసం సొసైటీ గోడౌన్‌కు వచ్చిన ఓ రైతు గుండెపోటుతో మృతి చెందాడు. ధర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. దుబ్బాకకు చెందిన రైతు మహిపాల్ (52)కు భార్య యమున, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.
యూరియా కోసం శుక్రవారం స్థానికంగా ఉన్న సొసైటీ గోడౌన్‌కు వచ్చిన మహిపాల్.. రెండు సంచులు మోసుకెళ్లాడు. మూడో సంచి కోసం గోడౌన్‌లోకి వచ్చి సంచి పైకి లేపుతుండగా ఒక్కసారిగా కుప్పకూలి పోయాడు. అక్కడ ఉన్న తోటి రైతులు సీపీఆర్ చేసి బతికించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. హుటాహుటిన ధర్పల్లి దవాఖానకు తరలించేలోగా మృతి చెందాడు. రైతు మృతితో దుబ్బాకలో విషాదఛాయలు నెలకొన్నాయి.