నవీపేట, జూలై 4: ఆ కుటుంబ సభ్యులంతా దొంగ ల ముఠాగా ఏర్పడ్డారు. ఆర్టీసీ బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీని ఆసరాగా చేసుకొని మహిళల మెడలో నుంచి బంగారు చైన్లు, పర్సుల చోరీలకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్న ఆ ఘరానా కుటుంబాన్ని నవీపేట పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిజామాబాద్ నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్, నవీపేట ఎస్సై శ్రీకాంత్‌తో కలిసి నిజామాబాద్ ఏసీపీ బి.ప్రకాశ్ దొంగల ముఠాకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని ఒకే కుటుంబానికి చెందిన వారంతా ముఠా ఏర్పడ్డారు.
ఈ ముఠాకు ప్రధాన సూత్రధారి అయిన ఖతీజా బేగం ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులు నజ్మాబేగం,షేక్ అంజాద్, అబ్దుల్ జుబేర్, షేక్ వసీం అహ్మద్, తహేరా కొంతకాలంగా జిల్లాలోని నవీపేట, నందిపేట, నిజామాబాద్ ఆర్టీసీ బస్టాండ్‌లో వృద్ధులు, మహిళల మెడలో నుంచి బంగారు గొలుసులు, ఇతర ఆభరణాలు, పర్సులు దొంగిలిస్తూ తప్పించుకు తిరుగుతున్నారు. గత నెల 17న నవీపేట ఆర్టీసీ బస్టాండ్‌లో బస్సు ఎక్కుతున్న వంకర విజయలక్ష్మి అనే వృద్ధురాలి మెడలో నుంచి ఖతీజా బేగం, నజ్మా, అంజాద్, తహేరా, అల్తాఫ్ కలిసి బంగారు గుండ్ల తాడును కత్తిరించుకొని భైంసాకు పరారయ్యారు. దొంగిలించిన సొత్తును విక్రయించడానికి వారు శనివారం కారులో నిజామాబాద్ వస్తుండగా నవీపేట ఎస్సై శ్రీకాంత్, సిబ్బంది చాకచక్యంగా పట్టుకున్నారు.
నిందితులైన ఖతీజా బేగం, నజ్మాబేగం, షేక్ అంజా ద్, అబ్దుల్ జుబేర్, షేక్ వసీం హైమద్, తహేరాను అరెస్టు చేసి, వారి నుంచి బంగారు ఆభరణలను స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించినట్లు ఏసీపీ ప్రకాశ్ తెలిపారు. అంతకు ముందు ఈ ముఠా కుబీ ర్, భైంసా, ముధోల్, ఆర్మూర్ తదితర ప్రాంతాల్లో దొంగ తనాలకు పాల్పడి జైలుకు వెళ్లివచ్చినట్లు తమ విచారణలో తేలిందని వెల్లడించారు. నిజామాబాద్ ఏసీపీ బి.ప్రకాశ్ ఆధ్వర్యంలో ఈ కేసును ఛేదించిన నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్, నవీపేట ఎస్సై శ్రీకాంత్, ఎస్సై గఫర్, హెడ్ కానిస్టేబుల్ రాజేశ్వర్, కానిస్టేబుళ్లు రాజరెడ్డి,రాకేశ్, సర్దార్‌సింగ్,శ్రీకాంత్ గౌడ్, దత్తాత్రేయగౌడ్, సీడీఆర్ సెల్ టీం సాగర్, శ్రీనివాస్, సందీప్, నాగరాజు, రాకేశ్, లలిత, ప్రవళిక, సిబ్బందిని సీపీ సాయి చైతన్య అభినందించారు.