నకిలీలు, అక్రమాలకు కామారెడ్డి జిల్లా చిరునామాగా మారింది. నకిలీకి కాదేది అనర్హం అన్నట్లుగా అనేక ఉదంతాలు వెలుగుచూస్తున్నాయి. జిల్లాలో నకిలీ సర్టిఫికెట్లు, నకిలీ కరెన్సీ వెలుగుచూడగా, కొంతకాలంగా నకిలీ వైద్యులు పట్టుబడుతున్నారు. ఫేక్ సర్టిఫికెట్లతో జనాన్ని బురిడీ కొట్టిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా లింగనిర్ధారణ పరీక్షలు చేపడుతున్నారు. తాజాగా రెండురోజుల క్రితం డిగ్రీ ఫెయిలైన ఓ వ్యక్తి జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేట్ దవాఖానలో డాక్టర్‌గా చెలామణి కావడం నకిలీ పర్వాల పరిస్థితికి అద్దం పడుతున్నది. ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్న ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవడంలో సంబంధిత అధికారుల నుంచి స్పందన లేకపోవడం గమనార్హం.
-కామారెడ్డి, జనవరి 10
కామారెడ్డి జిల్లా కేంద్రంలో గతేడాది నుంచి అక్రమంగా శిశు విక్రయాలు, చట్ట విరుద్ధంగా స్కానింగ్‌లు, నకిలీ వైద్యులు పట్టుబడడం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి ఘటనలు వెలుగుచూసినప్పుడు హడావుడి చేసే అధికారులు..విచారణ చేపట్టకుండా నివారణ చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్నిరోజుల క్రితం పట్టణంలోని శ్రీరాంనగర్‌కాలనీలో ఒకరు ఏకంగా తన ఇంట్లోనే లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహించడం జిల్లాలో సంచలనం రేపింది. ఎలాంటి అనుమతులు లేకుండా, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా స్కానింగ్ సెంటర్ ఏర్పాటు చేసుకున్నాడు. ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన వారికి స్కానింగ్ చేసి అందినకాడికి దోచుకున్నాడు. ఈ అక్రమ దందాకు వైద్యారోగ్యశాఖలో పనిచేస్తున్న కొందరు సహకారం అందిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ప్రభుత్వ దవాఖానల కన్నా ప్రైవేట్ హాస్పిటల్లో మెరుగైన వైద్యం అందుతుందనే ఆశతో వస్తున్న రోగులకు నిరాశే ఎదురవుతున్నది. దవాఖానలో పనిచేస్తున్న వైద్య సిబ్బంది అర్హతలపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.ఎలాగైనా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా దవాఖానలను నిర్వహిస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. తమను అడిగే వాడులేడనే భావనతో ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు.
ఎవరైనా వైద్యులు తమ వైద్య వృత్తిని నిర్వహించుకోవాలంటే ముందుగా డీఎంహెచ్‌వో నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. వైద్యకోర్సుకు సంబంధించిన సర్టిఫికెట్లను సమర్పించాలి. వైద్యాధికారులు సదరు సర్టిఫెకెట్లను పరిశీలించిన తర్వాతే దవాఖాన ఏర్పాటుకు అనుమతులు జారీ చేస్తారు. అలాగే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మెంబర్షిప్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎప్పటికప్పుడు ప్రైవేట్ దవాఖాలను తనిఖీలు చేయాల్సిన అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. ప్రైవేట్ దవాఖానల్లో అసలేం జరుగుతుందనే విషయం ఎవరికీ తెలియడంలేదు. అనుకోకుండా చోటుచేసుకుంటున్న ఘటనల్లో దవాఖాన యాజమాన్యం నిర్వాకం బయటపడుతున్నది. పట్టణంలోని ఓ ప్రైవేట్ దవాఖానలో రవీందర్‌రెడ్డి పేరు మీద డిగ్రీ ఫెయిలైన వ్యక్తి డాక్టర్‌గా చెలామణి అవుతుండగా.. అనుమానం వచ్చిన ఐఎంఏ ప్రతినిధులు అతడి నిజస్వరూపం బయటపెట్టారు.
అతడు డాక్టరే కాదని నిర్ధారించారు. ఈ వ్యవహారం ఇలా నకిలీ సర్టిఫికెట్లతో ప్రైవేట్ దవాఖానల్లో ఇంకా ఉన్నారనడానికి బలం చేకూరుస్తున్నది. ఇతర జిల్లాకు చెందిన రవీందర్‌రెడ్డికి కామారెడ్డిలోని ప్రైవేట్ దవాఖానలో ఏవిధంగా వైద్యుడిగా కొనసాగించారనే సందేహాలు తలెత్తుతున్నాయి. ప్రజల జీవితాలతో నకిలీ వైద్యులు చెలగాటం ఆడుతుంటే.. ప్రభుత్వ వైద్యాధికారులు ఏం చేస్తున్నారనే అనుమానాలు మొదలవుతున్నాయి. రాజకీయనాయకులు, అధికారుల పలుకుబడితో వైద్య వృత్తికి సంబంధం లేని వ్యక్తులు జిల్లాకేంద్రంలో దవాఖానలను నిర్వహిస్తుండడం గమనార్హం. తక్కువ మొత్తంలో జీతాలకు నామమాత్రంగా వైద్యులను తీసుకువచ్చి దవాఖానలు నడుపుతున్నారు. ఇదంతా వైద్యాధికారులకు తెలిసినా కాసులకు కక్కుర్తి పడి అనుమతులు ఇస్తున్నారు. పట్టణంలో మల్టీ స్పెషాలిటీ దవాఖానలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఎలాంటి అర్హత లేని వారు వైద్యవృత్తిని కొనసాగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ విషయంపై కామారెడ్డి జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్‌కు ఫోన్ చేసినప్పటికీ స్పందించలేదు.
జిల్లాలో నకిలీ వైద్యులు కోకల్లలు గా పుట్టుకొస్తున్నారు.గతంలో చాలా మంది నకిలీ వైద్యులను అరెస్టు చేసి, క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు పంపించారు. అయి నా నకిలీ వైద్యులు పట్టుబడుతూ ఉన్నారు. సులువుగా డబ్బులు సంపాదించాలనే లక్ష్యంతో వైద్య వృత్తిని ఎంచుకుంటున్నట్లు తెలుస్తున్నది. ప్రైవేట్ దవాఖాన హం గు ఆర్భాటాలు చూసి రోగులకు అక్కడికి వెళ్లి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. వైద్య వృత్తిని అడ్డంపెట్టుకొని కొందరు డబ్బులను దండుకుంటున్నారు.
కొత్త వైద్యులు డీఎంహెచ్‌వో కార్యాలయంలో తప్పకుండా అనుమతులు తీసుకోవాలి. జిల్లాలో ఎక్కడైనా దవాఖాన ఏర్పాటు చేయాలన్నా సర్టిఫికెట్లను చూపించాలి. ప్రజల జీవితాలతో ఆడుకునే నకిలీ వైద్యులను కఠినంగా శిక్షించాలి. దీనిపై ప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.