Fake doctors | వినాయక నగర్, మే18 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గత కొంతకాలంగా మెడికల్ అధికారుల కండ్లుగప్పి, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇద్దరు నకిలీ డాక్టర్ల బాగోతం బట్టబయలైంది. ప్రజలకు ప్రాణం పోసేవారు వైద్యులని ఒకపక్క జనాలు నమ్ముతుంటే, మరోపక్క మాత్రం జనాలను మోసం చేస్తూ ట్రీట్మెంట్ పేరుతో వారి వద్ద నుండి డబ్బులు దండుకోవడమే ఇద్దరూ నకిలీ వైద్యులు వృత్తిగా పెట్టుకున్నారు.
గత కొంతకాలంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఇలాంటి డాక్టర్ పట్టా లేకుండానే కంటి ఆసుపత్రిలో ఒకరు, ఫస్ట్ ఎయిడ్ పేరుతో మరొకరు డాక్టర్లుగా చలామణి అవుతున్న ఇద్దరు నకిలీ వైద్యుల బాగోతం ఎట్టకేలకు బయటపడింది. నిజామాబాద్ ఒకటవ టౌన్ ఎస్ హెచ్ ఓ బి. రఘుపతి తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ నగరంలోని బోధన్ బస్టాండ్ ప్రాంతంలో మహమ్మద్ సందాని అనే ఓ వ్యక్తి గత కొంతకాలంగా వైద్యుడిగా చలామణి అవుతూ ఫస్ట్ ఎయిడ్ హాస్పిటల్ నిర్వహిస్తున్నాడు.
అంతేకాకుండా జనాలకు ఇంజక్షన్లు చేయడం, చికిత్స చేయడంతో పాటు, గుల్కోస్లు సైతం పెడుతూ చికిత్సలు నిర్వహిస్తున్నాడు. శనివారం రోజు హైదరాబాద్ నుండి నిజామాబాద్ జిల్లా కేంద్రానికి తనిఖీల నిమిత్తం వచ్చిన విజిలెన్స్ అధికారి మేకల రాజేష్ నిర్వహించిన సోదాల్లో ఇలాంటి డాక్టర్ సర్టిఫికెట్ లేకుండానే మహమ్మద్ సందాని జనాలకు ట్రీట్మెంట్ చేస్తున్నాడని గుర్తించారు. దీంతో వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఎస్హెచ్ఓ తెలిపారు.
అలాగే నగరంలోని ఖలీల్ వాడి ప్రాంతంలో గల లయన్స్ కంటి దావఖానాలో సైతం విజిలెన్స్ అధికారి శనివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ హాస్పిటల్లో సైతం దొడ్డి ముంగటి సతీష్ అనే వ్యక్తి అస్తమాలజిస్ట్ పట్టా లేకుండానే రోగులకు వైద్యం చేస్తూ, ఇంజక్షన్లు ఇస్తున్నట్లు తనిఖీల్లో వెలుగు చూసినట్లు తెలిపారు. దీంతో సదరు నకిలీ వైద్యుడు పై సైతం ఒక డౌట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో నగరంలో ఇద్దరు నకిలీ వైద్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లుగా వన్ టౌన్ ఎస్హెచ్ఓ రఘుపతి వెల్లడించారు.