బీబీపేట (దోమకొండ), మార్చి 15: నకిలీ ధ్రువపత్రాలు దోమకొండలో కలకలం రేపాయి. ఈ విషయమై పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేశారు. దోమకొండ గ్రామ పంచాయతీ ప్రత్యేకాధికారి, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్, పంచాయతీ కార్యదర్శి యాదగిరి చాకచక్యంగా వ్యవహరించడంతో విషయం బయటపడింది. వివరాలు ఇలా ఉన్నాయి. దోమకొండకు చెందిన చింతల రవీందర్ నకిలీ మనీ వాల్యూ ట్యాక్స్ రశీదులు తయారు చేశాడు. వాటిని ఇటీవల కోర్టులో సమర్పించి జామీను పొందేందుకు యత్నించాడు.
పత్రాలను మెజిస్ట్రేట్‌కు సమర్పించేందుకు ప్రయత్నించగా.. అక్కడున్న వారు గమనించి దోమకొండ గ్రామ పంచాయతీ కార్యదర్శి యాదగిరికి సమాచారం అందించి, అతడికి వాట్సాప్ ద్వారా పంపించారు. గమనించిన పంచాయతీ కార్యదర్శి తన సంతకం పోర్జరీ చేసినట్లు గుర్తించాడు. స్థానిక పోలీసులకు బుధవారం ఫిర్యాదుచేశాడు. గ్రామానికి చెందిన మంగళిపల్లి శ్రావణ్ తనతోపాటు పెద్దమ్మ రాజమణి పేరుతో గోల్డ్‌లోన్ తీసుకున్నాడు.
తన పెద్దమ్మ ఆరోగ్యం బాగా లేదని గ్రామ పంచాయతీ నుంచి నకిలీ ధ్రువపత్రాలు తయారు చేసి వాటిని తీసుకెళ్లి బంగారాన్ని విడిపించుకున్నాడు. అది కూడా నకిలీ పత్రం అని తేలింది. దీంతో ఇద్దరిపై దోమకొండ గ్రామ పంచాయతీ కార్యదర్శి యాదగిరి పోలీసులకు ఫిర్యాదుచేశాడు. ఈ మేరకు వారిపై శుక్రవారం రాత్రి పోర్జరీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై స్రవంతి శనివారం తెలిపారు. ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉన్నదనే కోణంలో భిక్కనూరు సీఐ కార్యాలయంలో కూలీ లాగుతున్న పోలీసులు.. మరో ఇద్దరికి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.