బాల్కొండ : అంధత్వ నివారణకు రాష్ట్ర ప్రభుత్వం కంటి పరీక్షలు నిర్వహిస్తోందని మండల విద్యాధికారి బట్టు రాజేశ్వర్ తెలిపారు. విద్యార్థుల్లో దృష్టి లోపాన్ని నివారించేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో భాగంగా గురువారం బాల్కొండ లోని మహాత్మా జ్యోతిబాపూలే పాఠశాల విద్యార్థులకు నేత్ర వైద్య నిపుణులు గురురాజ్ ఆధ్వర్యంలో గత పది రోజులుగా కంటి పరీక్షలు నిర్వహించారు.
ఇవాళ మండల విద్యాధికారి బట్టు రాజేశ్వర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం (ఆర్బీఎస్కె) కింద రెండు విడతలుగా మండలంలోని ప్రభుత్వ బడుల్లో శిబిరాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. కంటి పరీక్షల శిబిరాలు పది రోజులపాటు కొనసాగుతాయన్నారు. మండలంలో ఇప్పటివరకు సుమారు 68 మంది విద్యార్థులకు కంటి చూపులో ఇబ్బందులు ఉన్నట్లు గుర్తించారు.
వారందరికి కంటి అద్దాల పంపిణీ చేయనున్నట్లు ఎంఈవో తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ హైమావతి, ఆప్తమాలిజిస్ట్ గురురాజ్, ఆర్బీఎస్కె మెడికల్ ఆఫీసర్ సూర్య నారాయణ, ఏఎన్ఎమ్ స్వరూప రాణి తదితరులు పాల్గొన్నారు.