Bodhan | శక్కర్ నగర్ : ప్రజలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, వాటి అమలుకు కృషి చేయాలని బోధన్ పట్టణ సీఐ వెంకటనారాయణ కోరారు. శనివారం బోధన్ పట్టణ పోలీసు ఆధ్వర్యంలో పలు ప్రధాన వీధుల గుండా సిబ్బందితో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు ప్రధాన క్రీడల వద్ద సీఐ మాట్లాడారు. రోడ్డుపై వాహనాలు నడిపే ప్రతీ ఒక్కరూ రోడ్డు నిబంధనలు, నియమాలు పాటించాలని అన్నారు.
ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతీ ఒక్కరు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, మద్యం సేవించి, త్రిబుల్ రైడింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయవద్దని సూచించారు. ముఖ్యంగా మైనర్లకు ద్విచక్ర వాహనాలు అప్పగించవద్దని, తమ తనిఖీల్లో మైనర్లు వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామని, ఇందులో సదరు మైనర్ తో పాటు వాహన యజమాని పై కూడా కేసు నమోదు చేయడం జరుగుతుందని ఆయన వివరించారు. అదేవిధంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించవద్దని కోరారు.
పట్టణంలో ఎక్కడైనా అసాంఘిక కార్యక్రమాలు కొనసాగితే పోలీసులకు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని అన్నారు. ప్రజారక్షణ కోసం పోలీసులు నిర్వహిస్తున్న విధులకు ప్రజలు సహకరించాలని సిఐ వెంకటనారాయణ కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ వెంకటనారాయణ తో పాటు, ఎస్సైలు, సిబ్బంది, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.