Nizamabad | సుభాష్‌నగర్ : నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ‘దేవుడి’ భూములకు రక్షణ కరువైంది. ఆలయ పరిరక్షణలో సంబంధిత యంత్రాంగం ఉదాసీన వైఖరి.. చట్టాల్లోని లొసుగులు అక్రమార్కులకు వరంగా మారాయి. దీంతో యథేచ్ఛగా కబ్జ్జాలకు పాల్పడుతూ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే వందలాది ఎకరాలు ఇతరుల చేతుల్లోకి వెళ్లినా.. సంబంధిత శాఖ మీనమేషాలు లెక్కిస్తోంది. ఏండ్ల క్రితం ఇండ్ల నిర్మాణం, సాగులో ఉన్నవారికి పట్టాపాసు పుస్తకాలు జారీ కాగా.. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆలయ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. చట్ట విరుద్ధంగా లీజులు, కౌలు ఎగవేతలు తదితర కారణాలతో అక్రమార్కులు దేవాదాయ శాఖ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు.
జిల్లాలో 213.10 ఎకరాలు బడారాంమందిర్ భూములు ఉండగా, నగరశివారు సారంగాపూర్ ప్రాంతంలో 88ఎకరాలు ఉన్నట్లు సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు. ఇందులో కౌలు కొంతమేర ఉండగా ఏండ్లుగా చెల్లించడం లేదు. ఎక్కువభాగం కబ్జాకు గురైనట్లు దేవాదాయశాఖ అధికారుల పరిశీలనలో తేలింది. ఒకటి, రెండుచోట్ల 99 ఏండ్లు లీజుకు తీసుకున్నట్లు తెలుస్తోంది. దేవాదాయశాఖ రికార్డుల్లో ఎకరానికి రూ.2వేలు కౌలుగా నిర్ణయించినా లీజుకు తీసుకున్నవారు ఇప్పటివరకూ చెల్లించడం లేదు. నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలో 18 ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి. నగర
శివారులో 9.11 ఎకరాలు కబ్జాకు గురయ్యాయి. ఇటీవలే శాఖ సహాయ కమిషనర్ రెవెన్యూ
అధికారులతో కలిసి పరిశీలించారు.
దేవాదాయశాఖలో భూముల రికార్డుల నిర్వహణ ఏండ్లుగా నిర్లక్ష్యానికి గురైంది. ఏ భూమి ఎక్కడ ఉందో శాఖ ఉద్యోగులకే హద్దులు తెలియని పరిస్థితి నెలకొన్నది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ఇతరులు సాగుచేసుకుంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఇండ్లు, కొన్నిచోట్ల వాణిజ్య అవసరాలకు షెట్టర్లను నిర్మించారు. ఆలస్యంగా తేరుకున్న అధికారులు వాటి విషయంలో కేసులు వేసేందుకు సన్నద్ధమవుతున్నారు. బడారాంమందిర్ భూములతో పాటు దేవాదాయ శాఖకు సంబంధించిన ఆలయ భూములను పరిరక్షించాలని భక్తులు కోరుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో 384 ఆలయాలకు 4153.25 ఎకరాల మాన్యం ఉంది. నిజామాబాద్ జిల్లాలో 247 ఆలయాల పరిధిలోనే 2287.18 ఎకరాలు, కామారెడ్డి జిల్లాలో 137 ఆలయాల పరిధిలో 1866.06 ఎకరాలు ఉన్నట్లు భూరికార్డులు చెబుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో 23 ఆలయాలకు సంబంధించి 245.22 ఎకరాలు, కామారెడ్డి జిల్లాలోని 23 ఆలయాలకు సంబంధించి 863.27 ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి. ఉమ్మడి జిల్లాలో 1109.09 ఎకరాలు ఇతరుల చేతుల్లోకి వెళ్లినట్లు సంబంధిత శాఖనే నిర్ధారించడం గమనార్హం.ఇందులో సదాశివనగర్‌లోని విశ్వేశ్వరస్వామి ఆలయానికి సంబంధించిన 528.24 ఎకరాలు ఉంది. బ్రహ్మపురి పెద్దరాంమందిర్ భూములు రెండు రాష్ర్టాల్లో ఉన్నాయి. మహారాష్ట్రలోని సజ్జన్ఘడ్లో శివాజీగురువు సమర్థరామదాసు స్థాపించిన మఠానికి అనుబంధంగా ఇందూరులోనూ బడారాంమందిర్ నెలకొల్పారు. దీని పరిధిలో 480.06 ఎకరాలు ఉండగా నిజామాబాద్ జిల్లాలో 213.10, ఆదిలాబాద్‌లో 149.32, మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో 117.04 ఎకరాలు ఉన్నాయి. నిజామాబాద్ గ్రామీణం, మోపాల్, మాక్లూర్, నందిపేట్, రెంజల్, బోధన్ 6 మండలాల్లో మఠానికి చెందిన భూములు ఉన్నాయి.