నిజామాబాద్ లీగల్, జనవరి 1: హైదరాబాద్ సంస్థానాధీశుడు అయిన నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఏలుబడిలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భాగమైన ఎల్లారెడ్డి తాలూకాలో 1925లో మొట్టమొదటి న్యాయస్థానం ఏర్పాటైంది. సివిల్ , క్రిమినల్ వివాదాలను చట్టపరిధిలో పరిష్కరించే ఒక న్యాయవ్యవస్థకు అంకురార్పణ జరిగింది. తదనంతరం 1926లో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రెండో మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టును ప్రారంభించారు. జిల్లా న్యాయవ్యవహారాల అవసరాల మేరకు జిల్లాలోని 1928లో బోధన్, 1932లో ఆర్మూర్ తాలూకా, 1934లో కామారెడ్డి కేంద్రంగా మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులను నిజాం ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో పోలీస్ చర్య అనంతరం హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో 1948 సెప్టెంబర్ 18న విలీనం కావడంతో రాజ్యాంగానుసారం భారత స్వతంత్ర న్యాయవ్యవస్థ ఏర్పడిన అనంతరం సీనియర్ సివిల్ జడ్జి కోర్టు 1950లో జిల్లా కోర్టు, 1951లో నిజామాబాద్ జిల్లా కేంద్రంగా తమ విధులను నిర్వహించడం ప్రారంభించాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 23 నూతన రెవెన్యూ జిల్లాలను ఏర్పాటు చేయడం, ఇందులో భాగంగా 2 జూన్, 2022న కామారెడ్డి జిల్లా కోర్టును వర్చువల్ విధానంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ. రమణ, సీఎం కేసీఆర్, నాటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీశ్ చంద్ర ప్రారంభించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో న్యాయవ్యవస్థతో ఉన్న 96 ఏండ్ల నాటి అనుబంధం విడిపోయింది.
ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు సహా అదనపు జిల్లా కోర్టు ఏర్పాటుతో పాటు కామారెడ్డి సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ( అసిస్టెంట్ సెషన్స్ కోర్టు ), ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జికోర్టు, స్పెషల్ మొబైల్ కోర్టు, సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద జూనియర్ సివిల్ జడ్జి కోర్టులను కలుపుకుని తన న్యాయప్రస్థానాన్ని కొనసాగిస్తున్నది.
జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఏర్పాటుతో పరిపూర్ణత
న్యాయసేవలను విస్తృత పరచాలనే లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాజపత్రంలో కామారెడ్డి జిల్లా న్యాయసేవ అధికార సంస్థను ఏర్పాటు చేయాలనే వివరాల మేరకు తెలంగాణ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ, హైకోర్టు ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. కామారెడ్డి జిల్లా కోర్టు ప్రాంగణంలో జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యాలయం, న్యాయసేవా సదన్‌ను సిద్ధం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి , రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ప్యాట్రాన్ ఆన్ చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, హైకోర్టు న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయసేవా అధికార సంస్థ కార్యనిర్వాహక చైర్మన్ జస్టిస్ పి.నవీన్ రావు, కామారెడ్డి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి, హైకోర్టు న్యాయమూర్తి గిరిజ ప్రియదర్శిని వర్చువల్ విధానంలో కామారెడ్డి జిల్లా న్యాయసేవాధికార సంస్థను సోమవారం ప్రారంభించనున్నారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్ ఎన్ శ్రీదేవి, జిల్లా న్యాయసేవా సంస్థ కు చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు. సంస్థ ప్రథమ చైర్ పర్సన్‌గా , కార్యదర్శిగా సీనియర్ సివిల్ జడ్జి డి. కిరణ్ కుమార్ కామారెడ్డి జిల్లా న్యాయవ్యవస్థ చరిత్రలో భాగం కానున్నారు. సంస్థ సూపరింటెండెంట్‌గా వంచ చంద్రసేనా రెడ్డి, నియమితులయ్యారు. ఈయన నిజామాబాద్ న్యాయసేవా సంస్థ సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తూ పదోన్నతిపై వస్తున్నారు. 22ఏండ్ల వృతి అనుభవం ఆయనకున్నది.
న్యాయసేవా సంస్థ సేవలు
భారత రాజ్యాంగం ఆర్టికల్ 39ఏ.. సమాన న్యాయం , ఉచిత న్యాయసేవల సహాయం.. పౌరులకు వారి ఆర్థిక, ఇతర అర్హతల కారణంగా న్యాయం పొందే అవకాశం లేకుండా పోవచ్చనే ఉద్దేశంతో ఉచిత న్యాయ సహాయం అందిస్తుంది. న్యాయసేవా సంస్థ.. ఇందుకు అనుగుణంగా న్యాయసేవల ప్రాధికారముల చట్టం1987 ప్రకారం కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు బడుగు, బలహీన వర్గాలకు చేరే విధంగా కృషి చేస్తున్నది. పోక్సో కేసుల్లో బాధితులైన వారికి, ఇతర క్రిమినల్ నేరాల్లో తల్లిదండ్రులను కోల్పోయిన వారికి ఆర్థిక తోడ్పాటును అందిస్తుంది. చట్టపరమైన అంశాలను ప్రజలకు, విద్యార్థులకు తెలియచేయడానికి న్యాయవిజ్ఞాన సదస్సులు నిర్వహిస్తున్నది. ప్రస్తుతం న్యాయస్థానాల విచారణలో ఉన్న సివిల్ దావాలు, రాజీపడదగిన క్రిమినల్ కేసులను రాజీ పద్ధతిన కక్షిదారుల అభిమతం మేరకు పరిష్కరించి అవార్డులు జారీ చేస్తున్నది.