లింగంపేట, సెప్టెంబర్ 20:పురాతన కట్టడాలు చరిత్రకు సాక్ష్యాలు అని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు అన్నారు. పునరుద్ధరణ పొందిన లింగంపేట మండల కేంద్రంలోని మనోహర్ వాటికా నాగన్న బావిని శుక్రవారం రాత్రి ఆయన ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పురాతన కట్టడాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. నాగన్న బావిని అభివృద్ధి చేయడానికి సంకల్పించిన అప్పటి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ కృషి అభినందనీయమన్నారు. నాగిరెడ్డిపేట మండలంలోని తాండూర్ గ్రామంలో ఉన్న త్రిలింగేశ్వర ఆలయాన్ని సైతం అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. నాగన్న బావి చరిత్రను పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు వివరించానని, ఆయన త్వరలోనే సందర్శిస్తారన్నారు.
గుజరాత్ రాష్ట్రంలో రాణికి వావ్ను నాగన్న బావి పోలి ఉందన్న ఎమ్మెల్యే.. బావి చరిత్రను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేయాలని యువతకు పిలుపునిచ్చారు. ప్రచారం పొందితేనే గుర్తింపు వస్తుందన్నారు. చారిత్రక కట్టడాలను కాపాడుకోవాలని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ సూచించారు. నాగన్న బావిని పర్యాటక ప్రాంతంగా మారుస్తామన్న ఆయన.. లింగంపేట మండలాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. రెయిన్ వాటర్ ప్రాజెక్టు ఫౌండర్ కల్పనారమేశ్ మాట్లాడుతూ.. లింగంపేటకు చెందిన రజాక్ నాగన్న బావిపై ఆర్టికల్ రాశారని, 2020 మే మాసంలో ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం ప్రచురించిందన్నారు.
రెయిన్ వాటర్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఇప్పటి వరకు నాగన్నబావితో సహా 24 బావులు అభివృద్ధి చేశామని వివరించారు. ప్రారంభోత్సవానికి ముందు పరంపర ఫౌండేషన్ అధ్వర్యంలో నిర్వహించిన కళా ప్రదర్శన ఆకట్టుకున్నది. అనంతరం నాగన్న బావికి భూమి విరాళంగా అందించిన భూదాత మనోహర్రావును కలెక్టర్ సన్మానించారు. ఎస్పీ సింధూశర్మ, బాన్సువాడ సబ్ కలెక్టర్ డాక్టర్ కిరణ్మయి కొప్పిశెట్టి, డీఈవో రాజు, డీఆర్డీవో సురేందర్, ఎంపీడీవో నరేశ్, తహసీల్దార్ నరేందర్, ఏపీఎం చామంతి శ్రీనివాస్, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.