సుభాష్‌నగర్, మార్చి 30 : ముస్లింలకు అత్యంత ప్రీతిపాత్రమైనది రంజాన్ మాసం. 30 రోజులుగా చేపట్టిన దీక్షలు ఆదివారం ముగిశాయి. నేడు (సోమవారం) రంజాన్ పండుగ (ఈదుల్ ఫితర్) జరుపుకోనున్నారు. పండుగ సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనల కోసం ఏర్పాట్లు చేశారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖిల్లా, అర్సపల్లి, గాంధీచౌక్, గాజుల్పేట్, కంఠేశ్వర్, వినాయక్‌నగర్ తదితర ప్రాంతాల్లో ఉన్న ఈద్గాలను సామూహిక ప్రార్థనలకు సిద్ధం చేశారు. పండుగ సందర్భంగా పెద్దబజార్, గాంధీచౌక్, నెహ్రూపా ర్కు, బోధన్ బస్టాండ్ తదితర ప్రాంతాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. రంజాన్ పండుగ నేపథ్యంలో జిల్లాకేంద్రంతోపాటు బోధన్ పట్టణంలో సీపీ సాయి చైతన్య పర్యటించారు. ఈద్గాలు, మసీదులను పరిశీలించారు.