బోధన్, ఫిబ్రవరి 24: విద్యార్థులు భవిష్యత్తు ప్రణాళికతో ఉన్నత విద్యాభ్యాసం చేయాలని జిల్లా ఇంటిర్మీడియట్ విద్యాధికారి లోకం రఘురాజ్ సూచించారు. పట్టణంలోని మహాలక్ష్మి కల్యాణ మండపంలో నెహ్రూ యువకేంద్రం ఆధ్వర్యంలో ఉన్నత చదువులపై విద్యార్థులకు అవగాహన సదస్సును గురువారం నిర్వహించారు. కార్యక్రమానికి డీఐఈవో ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఉన్నత చదువుతో విద్యార్థితో పాటు తల్లిదండ్రులు, గ్రామానికి గుర్తింపు లభిస్త్తుందన్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ విద్యాభ్యాసం కొనసాగించాలని సూచించారు. ఆరోగ్యం బాగుంటే మంచి ఆలోచనలు వస్తాయని, భవిష్యత్తు బాగుంటుందని, ఇదే ఫిట్ ఇండియా లక్ష్యమని డీఐఈవో అన్నారు. మోటివేషనల్ స్పీకర్ లాభిశెట్టి మహేశ్ మాట్లాడుతూ.. విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురికావొద్దని సూచించారు. టీబీ నియంత్రణ జిల్లా అధికారి రవిగౌడ్ మాట్లాడుతూ.. యువత క్షయ వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలన్నారు. జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ రాచయ్య మాట్లాడుతూ.. యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. యోగా ఆచార్యుడు గంగాధర్ యోగా, ప్రాణాయామానికి విద్యార్థులు నిత్యం కొంత సమయం కేటాయించి ఆరోగ్యంగా ఉండాలన్నారు. జిల్లా యువజన అధికారిణి శైలీ బెల్లాల్, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.