బాన్సువాడ, ఫిబ్రవరి 25: కేసీఆర్ ప్రభుత్వ నిర్ణయాలతో సాగు విస్తీర్ణం పెరిగి వ్యవసాయం పండుగలా మారిందని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. వలసలు వెళ్లిన వారు ఊళ్లకు వాపసు వచ్చారని తెలిపారు. బాన్సువాడ డివిజన్ కేంద్రంలోని రెడ్డి సంఘంలో శనివారం నిర్వహించిన కురుమ కులస్తుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వృత్తుల మీద బతికే వారని తెలిపారు. కులవృత్తితోపాటు వ్యవసాయం కూడా చేసుకొనేవారని అన్నా రు. కాళేశ్వరం నుంచి నిజాంసాగర్‌కు గోదావరి జలాల తరలింపు, రైతాంగానికి 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా, పెట్టుబడి సాయం, కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధర అందించడం తదితర పథకాలను ప్రవేశపెట్టడంతో ఊళ్లను వదిలి వలసపోయిన వారు వాపస్ వచ్చారని తెలిపారు. అప్పుల బాధ నుంచి బయటపడి సంతోషంగా బతుకుతున్నారంటే రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలే అని పేర్కొన్నా రు. తాను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూరగాయలు, మేకలు, గొర్రెలు, చేపలు ఎక్కడ నుంచి వస్తున్నాయి, చేపల ఉత్పత్తి అంటే ఏంటి తదితర అంశాలపై ఆలోచించి గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. సబ్సిడీపై గొర్రెల పంపిణీతో ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా గొర్రెలను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. 18 ఏండ్లు నిండిన గొల్లకురుమలు గొర్రెల పంపిణీ పథకానికి అర్హులని తెలిపారు. గత పాలకులు, ప్రభుత్వాలు ఇలాంటి పథకాలను అమలుచేయలేదన్నారు. మన రాష్ట్రంలో అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఇతర రాష్ర్టాల వారు తమను తెలంగాణలో కలుపుకోవాలని స్థానిక నాయకులపై ఒత్తిడి తెస్తున్నారని గుర్తుచేశారు.
బాన్సువాడ నియోజకవర్గంలో కొందరు నాయకులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, లేనిపోని ఆరోపణలు చేస్తే సహించేదిలేదని హెచ్చరించారు. బాన్సువాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి మాట్లాడుతున్నామని, ఇది ప్రజలకు తెలుసన్నారు. మైకులు పట్టుకొని కల్లబొల్లి మాటలు చెప్పడం, మోచేతికి బెల్లం పెట్టడం మానుకోవాలని సూచించారు. అసలు వారు ఏం అభివృద్ధి చేశారో చెప్పి మాట్లాడాలని అన్నారు. తెలంగాణ సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎందుకు అమలుకావడంలేదని ప్రశ్నించారు. పద్ధతి మార్చుకోవాలని, ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. అనంతరం స్పీకర్ పోచారం, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డిని సన్మానించారు, కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, సొసైటీ చైర్మన్ ఏర్వాల కృష్ణారెడ్డి, మహ్మద్ ఎజాస్, భూషణ్‌రెడ్డి, కుర్మ సంఘం జిల్లా అధ్యక్షుడు భూమన్న, కార్యదర్శి పర్వుగొండ, నియోజక వర్గ నాయకులు గంగుల గంగారాం, యూత్ అధ్యక్షుడు రమేశ్, భాస్కర్, బీరప్ప, నర్సుగొండ, కుర్మ గంగాధర్, భూంగొండ, శ్రీనివాస్, గణేశ్ తదితరులు పాల్గొన్నారు.