నిజామాబాద్, ఆగస్టు 10, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) కాలంతో సంబంధం లేకుండా… కరువు కాటకాల్లోనూ తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు మిషన్ భగీరథ అనే అద్భుతమైన పథకాన్ని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రూపొందించారు. ఇంటింటికీ శుద్ధి చేసిన భూ ఉపరితల జలాలను అందించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని తీసుకు వచ్చారు. దేశంలో మరెక్కడా లేని విధంగా మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలోనే గడప గడపకూ స్వచ్ఛమైన తాగునీరును వందకు వందశాతం అందించారు. ఈ అద్భుతమైన ఘట్టం పదేళ్ల కేసీఆర్ పరిపాలనలోనే సాకారమైంది. 2023, డిసెంబర్లో అధికారంలోకి వచ్చింది.
వచ్చి రాగానే సీఎం రేవంత్ రెడ్డి నోటికొచ్చిన బూతులు తిట్టి పోశారు. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తానంటూ శపథం చేసి ప్రజల్లో విష భీజాలు నాటారు. 32 నెలల రేవంత్ రెడ్డి పాలనలో మిషన్ భగీరథ పథకానికి ప్రత్యామ్నాయం కనుక్కోలేక పోయాడు. కేసీఆర్ అంటే మిషన్ భగీరథ… మిషన్ భగీరథ అంటే కేసీఆర్ అనే స్థాయిలో స్వచ్ఛమైన తాగునీటి పథకం విరామం లేకుండా అమలవుతోంది.
కేసీఆర్ పాలనలో ఏర్పాటైన భగీరథ తాగునీటి వ్యవస్థనే నాలుగున్నర కోట్ల మందికి ఆయువుపట్టుగా నిలుస్తోంది. కేసీఆర్ సారథ్యంలో మిషన్ భగీరథకు వైస్ ఛైర్మన్‌గా నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వ్యవహరించారు. విరామం లేకుండా ఈ శుద్ధ జలాల పథకం అమలవుతోంది. ఆగస్టు 6 నాటికి ఈ మహత్తర పథకం ఆరంభమై పదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో పరుగులు తీస్తోన్న భగీరథ పథకంపై సవివరంగా ప్రత్యేక కథనం…
కాలంతో సంబంధం లేకుం డా ఏ కాలమైనా ఎంతటి విపత్కర పరిస్థితులు ఏర్పడినా తెలంగాణ ప్రజలకు నిరంతరం తాగునీరు అందించడమే లక్ష్యంగా మిషన్ భగీరథ పుట్టింది. వర్షాభావ పరిస్థితులు ఎదురైతే తాగునీటికి వనరుల కొరత ఏర్పడుతుంది. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా కేసీఆర్ ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకుంది. ఇందులో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టుతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టును పునరుజ్జీవ పథకం ద్వారా అనుసంధానించారు. నిరంతరం నీటిని మిషన్ భగీరథకు తరలించే విధంగా గత కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. సింగూర్‌కు సైతం కాళేశ్వరం జలాలు తరలించేలా ప్రణాళికలు అమలు చేసి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ఢోకా లేకుండా చేశారు. సమైక్య రాష్ట్రంలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలోని మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో నీటి గోస వర్ణనాతీతంగా ఉండేది. సుదూర దూరాలకు వెళ్లి తాగు నీటికి మోసుకొచ్చే దుస్థితి కనిపించేది. స్వచ్ఛమైన నీరు నేరుగా ఇంటి గడపకే మిషన్ భగీరథ రూపంలో రావడం మొదలైన తర్వాత ఖాళీ బిందెలు కనిపించడం లేదు. దురదృష్టవశాత్తు రేవంత్ రెడ్డి పాలనలో ముందుచూపు లేకపోవడంతో కొన్ని చోట్ల ప్రజలు గోస పడాల్సిన దుస్థితి వెలుగు చూసింది.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు మిషన్ భగీరథకు సింగూర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులే కీలకం. సింగూర్ ప్రాజెక్టు నీటి ద్వారా బోధన్ నియోజకవర్గంలో 4 మండలాలు, జుక్కల్ నియోజకవర్గంలో 6 మండలాలు, బాన్సువాడ నియోజకవర్గంలోని 8 మండలాలతో పాటుగా ఎల్లారెడ్డిలోని 3 మండలాలు మొత్తం 21 మండలాల్లో 819 గ్రామాలకు తాగునీటి సరఫరా జరుగుతుంది. సింగూర్ సెగ్మెంట్ పరిధిలో 21 మండలాలకు 819 ఆవాసాలకు నీళ్లు అందుతున్నాయి. 518.44 కిలో మీటర్లు పైప్ లైన్ వేశారు. ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటి ద్వారా ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్, కామారెడ్డి నియోజకవర్గాలతో పాటుగా ఎల్లారెడ్డిలోని సగం మండలాలకు మొత్తం 554 గ్రామాలకు తాగునీరు అందుతుంది. శ్రీరాంసాగర్ సెగ్మెంట్లో 1547 కిలో మీటర్లు మేర పైప్‌లైన్ బిగింపు జరిగింది. 862 ఆవాసాలకు బల్క్‌వాటర్ సైప్లె విజయవంతంగా ప్రతి రోజూ సాగుతోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1681 ఆవాసాలకు మిషన్ భగీరథ పథకం అందుతోంది.
పొద్దున లేస్తే కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కలిసి కట్టుగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీపైనే విధ్వేషం చిమ్ముతారు. తెల్లారి లేస్తే కేసీఆర్ జపం చేయని దినం అం టూ ఉండదు. పరస్పరం జాతీయ స్థాయిలో వైరి పార్టీలుగా చలామ ణి అవుతున్నప్పటికీ తెలంగాణలో కుట్రలు, కుతంత్రాలతో ఈ రెండు జాతీయ పార్టీలు కలిసి నీచ రాజకీయాలు చేస్తున్నాయి. కేవలం కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ విష ప్రచారం చేస్తూ పబ్బం గడుపుతున్నాయి. పదేళ్ల కేసీఆర్ పాలనపై ఆధారాల్లేకుండా నోటికొచ్చినట్లుగా ఆరోపణలు చేస్తారు. తిరిగి కేసీఆర్ షురూ చేసిన కార్యక్రమాలను, పథకాలనే అమలు చేస్తున్నారు. అందుకు మచ్చుతునక మిషన్ భగీరథ పథకమే. తాగునీటి ఎద్దడిని శాశ్వతంగా తొలగించేందుకు శ్రీకారం చుట్టిన ఈ పథకాన్ని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం సైతం కాపీ కొట్టిందంటే అతిశయోక్తి కాదు. ఇంటింటికీ నీరు అందించాలనే మోదీ సంకల్పానికి కేసీఆర్ తీసుకు వచ్చిన మిషన్ భగీరథ పథకమే స్ఫూర్తి. ఒకప్పుడు మంచి నీళ్ల కోసం రోడ్డు ఎక్కి ధర్నాలు, రాస్తారోకోలు చేసే ప్రజలంతా సంతోషంగా ఇంటి గడప దగ్గరికే వచ్చే నీళ్లతో సంబురంగా ఉంటున్నారంటే ఇందుకు ప్రధాన కారణం మిషన్ భగీరథ పథకమే.
