కంఠేశ్వర్, సెప్టెంబర్ 18 : నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రముఖ బాక్సింగ్ క్రీడాకారిణి నిఖత్ జరీన్‌కు డీఎస్పీగా పోస్టింగ్ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు డీజీపీ జితేందర్ నిఖత్ జరీన్‌కు నియామక పత్రాన్ని బుధవారం అందజేశారు. నిఖత్ జరీన్ ఇటీవల ఇస్తాంబుల్‌లో జరిగిన అంతర్జాతీయ మహిళా బాక్సింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో గెలిచి చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే.
రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే నజరానాతోపాటు హైదరాబాద్‌లో నివాస స్థలాన్ని కేటాయించింది. కేంద్ర ప్రభుత్వం అర్జున అవార్డును ప్రదానం చేయగా.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు గ్రూప్-1 ఉద్యోగంలో నిఖత్ జరీన్‌ను నియమించింది. దీంతో ఆమెకు నిజామాబాద్ జిల్లా క్రీడాకారులు, ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.