మాక్లూర్, జూలై 14: బిడ్డలకు గోరుముద్దలు తినిపించేందుకు వచ్చిన ఓ విద్యార్థి తల్లి, మరో విద్యార్థి అమ్మమ్మను విధి బలి తీసుకున్నది. మృత్యురూపంలో వచ్చిన కారు ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందిన ఘటన మాక్లూర్ మండలం దాస్‌నగర్‌లోని బాలికల గురుకుల పాఠశాల వద్ద ఆదివారం చోటు చేసుకున్నది. స్థానికులు, పోలీసులు తెలిపిన కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. దాస్‌నగర్‌లోని మహాత్మాజ్యోతిబా ఫూలే రెసిడెన్షియల్ బాలికల పాఠశాల, కళాశాలలో ప్రతి నెలా రెండో ఆదివారం తల్లిదండ్రుల సందర్శనకు అనుమతి ఉంటుంది.
ఈ నేపథ్యంలో 8వ తరగతి చదువుతున్న ఈశ్వరిని చూసేందుకు బోధన్ మండలం చిన్నమావందికి చెందిన తల్లిదండ్రులు పద్మ,శంకర్, అక్క గౌతమి, ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న హారికను చూసేందుకు ఇందల్వాయి మండలం సిర్నాపల్లికి చెందిన తల్లి నీలా, అమ్మమ్మ పోశమ్మ వచ్చారు. తెచ్చిన భోజనాన్ని పిల్లలకు తినిపించేందుకు పాఠశాల బయటికి తీసుకువెళ్లారు.
భోజనాలు ముగిసిన అనంతరం తిరిగి పాఠశాలలో వదిలేందుకు రోడ్డు వెంట వెళ్తుండగా నందిపేట నుంచి అతివేగంగా వస్తున్న టీఎస్ 16ఈఎక్స్1234 నంబర్ గల కారు అదుపుతప్పి వారిని ఢీకొట్టింది.
దీంతో పద్మ(35), పోశవ్వ(60) అక్కడికక్కడే మరణించారు. పోశవ్వ కూతురు నీలా, మనుమరాలు హారిక, పద్మ కూతురు ఈశ్వరీకి తీవ్రగాయాలు కాగా చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని దవాఖానకు తరలించారు. కారు నడిపిన వ్యక్తిని పట్టుకొని స్థానికులు దేహశుద్ధి చేయడంతో దవాఖాన తరలించారు. ఘటన స్థలాన్ని రూరల్ సీఐ సతీశ్, మాక్లూర్, నవీపేట్, రూరల్ ఎస్సైలు సుదీర్‌రావు, యాదగిరిగౌడ్,మహేశ్ పరిశీలించారు. డ్రైవర్‌పై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.