వినాయక్‌నగర్, డిసెంబర్ 1: కేంద్ర ప్రభుత్వం మోటర్ వెహికిల్ అమెండ్మెంట్ యాక్ట్-2019ను ఇటీవల అమలులోకి తెచ్చింది. దీంతో నిజామాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో కొన్ని రోజులుగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. జరిమానా భారీగా పెంచడంతోపాటు, ఎక్కువ రోజులు జైలు శిక్ష విధిస్తున్నారు. గతంలో అమలులో ఉన్న మోటర్ వెహికిల్ యాక్ట్ 1988 ప్రకారం సెక్షన్ 185 కింద డ్రంక్ అండ్ డ్రైవ్‌లో మొదటి సారి పట్టుబడిన వారికి రూ.రెండు వేలు జరిమానా లేదా ఆరు నెలల వరకు జైలు శిక్ష లేదా జరిమానాతో పాటు జైలు శిక్ష రెండూ విధించేవారు.
మొదటి సారి పట్టుబడిన అనంతరం మూడేండ్లలో మరోసారి తాగి దొరికితే వారికి రూ.మూడు వేల జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష లేదా జరిమానాతో పాటు జైలు శిక్ష పడేది. ప్రస్తుతం ప్రభుత్వం మోటర్ వెహికిల్ అమెండ్మెంట్ యాక్ట్-2019ను అమలు చేస్తున్నది. ఈ చట్టం ప్రకారం మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడిన వారికి భారీగా జరిమానాలు విధించడంతోపాటు జైలు శిక్షను కూడా పెంచారు. దీంతో వాహనదారుల్లో గుబులు మొదలైంది. ఈ యాక్ట్ ప్రకారం.. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో మొదటిసారి పట్టుబడితే రూ.పదివేల జరిమానాతో పాటు ఆరు నెలల వరకు జైలు శిక్ష లేదా రెండూ విధిస్తున్నారు. రెండోసారి పట్టుబడిన వారికి రూ.15వరకు జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష లేదా రెండు శిక్షలు విధించే అవకాశం ఉన్నది.
నిజామాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఇరవై రోజుల వరకు ప్రతిరోజూ వంద నుంచి 150 వరకు కేసులు నమోదు కాగా.. ప్రస్తుతం 50లోపే నమోదు అవుతున్నట్లు రికార్డుల ద్వారా తెలుస్తున్నది. దీనికి ప్రధాన కారణం కొత్త రూల్స్ అమల్లోకి రావడమే అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వారికి ఇదివరకు కోర్టులో మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పర్చగా.. నిందితులకు విధించే జరిమానా రోజు సుమారు రూ.50వేల వరకు మాత్రమే ఉండేది. కానీ కొత్త చట్టం అమల్లోకి రావడంతో అది ఏకంగా రూ.రెండు లక్షల నుంచి రూ.మూడు లక్షల వరకు పెరిగింది.
మద్యం తాగి వాహనాన్ని నడుపుతూ ఎదుటి వ్యక్తి మరణానికి కారణమైతే అతడిపై ఐపీసీ సెక్షన్ 105 బీఎన్ఎస్(304-2)కింద కేసు నమోదు చేస్తారు. ఈ సెక్షన్ ప్రకారం పదేండ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానాతోపాటు జైలు శిక్షను విధిస్తారు. తాగి వాహనం నడుపుతూ ఎదుటి వ్యక్తిని గాయపరిస్తే సెక్షన్ 110 బీఎన్ఎస్(308 ఐపీసీ) కింద కేసు నమోదు చేస్తారు. దీని ప్రకారం వాహనదారుడికి ఏడేండ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానాతోపాటు జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉన్నది. కాగా.. పోలీసులు బ్రీత్ ఎనలైజర్ ద్వారా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో ఎవరైనా వాహనదారుడు పరీక్షకు నిరాకరిస్తే.. అతడికి కూడా కోర్టు జైలు శిక్ష విధించే అవకాశం ఉన్నది.
తమ కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకొని వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపడానికి పూర్తిగా స్వస్తి చెప్పాలి. ప్రతి వాహనదారుడూ రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలి. వాహనాలు నడుపుతూ సురక్షితంగా గమ్యస్థానం చేరుకోవాలి. తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు సహకరించాలి.
– సాయిచైతన్య, సీపీ