కంఠేశ్వర్, జూలై 6: భవిష్యత్తును అంధకారంగా మారుస్తూ జీవితాన్ని నాశనం చేసే మత్తుపదార్థాలు, మాదక ద్రవ్యాలకు ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని హైకోర్టు జడ్జి, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ సుజోయ్ పాల్ హితవు పలికారు. ఉజ్వల భవిత కలిగిన విద్యార్థులు మత్తు పదార్థాల వైపు మళ్లకుండా తమ లక్ష్యం దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల నిర్మూలన అంశంపై శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. జస్టిస్ సుజోయ్ పాల్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు డ్రగ్స్‌కు అలవాటుపడి, మానసిక కుంగుబాటుకు లోనవుతూ బలవన్మరణాలకు పాల్పడుతుండడం ఆందోళన కలిగించే అంశంగా మారిందన్నారు. అందుబాటులోకి వచ్చిన ఆధునాతన సాంకేతిక, సమాచార విప్లవంతో విజ్ఞానపరమైన అనేక అంశాలను తెలుసుకునే వెసులుబాటు ఏర్పడిందని, అదే సమయంలో యువత, విద్యార్థులు పెడదోవ పట్టేందుకు కూడా కారణంగా నిలుస్తున్నాయని అభిప్రాయపడ్డారు.
నిరంతర కృషి,ఆత్మవిశ్వాసం, పట్టుదలతో గమ్యం దిశగా ముందుకు సాగాలని అన్నారు. హైకోర్టు జడ్జి శ్రీ సుధ మాట్లాడుతూ ఎవరైనా డ్రగ్స్‌కు అలవాటు పడినట్లు గమనిస్తే వెంటనే వారి తల్లిదండ్రులకు తెలియజేయాలని, దీనిని సామాజిక బాధ్యతగా గుర్తించాలని సూచించారు. అనంతరం మత్తు పదార్థాలతో కలిగే దుష్ప్రభావాలు, వాటికి దూరంగా ఉండేందుకు అనుసరించాల్సిన పద్ధతులపై నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో హైదరాబాద్ జోనల్ డైరెక్టర్ సచిన్ గోర్పడే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న సామాజిక కార్యక్రమాలను జిల్లా జడ్జి సునీత కుంచాల వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి పంచాక్షరి, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, సీపీ కల్మేశ్వర్, న్యాయధికారులు, వివిధ పాఠశాల,కళాశాలల విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.