కాలనీలో తాగునీటి సమస్య పరిష్కారానికి రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి బోరు, పైపులైన్ కోసం రూ. లక్షా 50 వేల నిధులు మంజూరు చేసి ఆరు నెలలు గడుస్తున్నా ఇంతవరకు బోరు వేయించే నాథుడే కరువయ్యాడు. అధికార పార్టీకి చెందిన ఓ గ్రామ నాయకుడికి బోరు వేసే బాధ్యతను పార్టీ పెద్దలు చెప్పినా కూడా ప్రయోజనం లేకుండా పోయిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో రూ.17 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టేందుకు శ్రద్ధ చూపిన సదరు నాయకుడు, బోరు వేయించి తాగునీటి సమస్యను పరిష్కరించడంలో మాత్రం చొరవ చూపడంలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
గుట్ట ప్రాంతంలో చాలా మంది తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నరు. ఆరు నెలల క్రితం బోరు పైపులైన్ కోసం ఎమ్మెల్యే నిధులు మంజూరు చేసినా ఎవరూ పట్టించుకుంటలేరు. మిషన్ భగీరథ నీరు చాలా తక్కువగా వస్తున్నయ్. మా కాలనీలోని చిన్న ట్యాంక్ నుంచి నీరు సరిపోవడం లేదు. ఇంకో ట్యాంక్‌ను నిర్మించి వెంటనే బోరు వేయించాలి.
– శోభ, రాంనగర్ గుట్ట ప్రాంత నివాసి
నెల రోజుల నుంచి మిషన్ భగీరథ నీళ్లు సరిపడా రావడంలేదు. వచ్చే ఆ కొద్ది నీళ్ల కోసం కోట్లాడుకోవాల్సి వస్తున్నది. మా సమస్యను ఎవరూ పట్టించుకుంటలేరు. నీళ్లు సరిపోక ఫిల్టర్ నీటిని కొనుక్కోవాల్సి వస్తున్నది. అధికారులు పట్టించుకొని తాగునీటి సమస్యను పరిష్కరించాలి.
-లక్ష్మి, రాంనగర్ గుట్ట ప్రాంత నివాసి