కోటగిరి, సెప్టెంబర్ 27: తాగునీటి కోసం మహిళలు రోడ్డెక్కారు. నీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కోటగిరి మండలంలోని ఎక్లాస్పూర్ క్యాపులోని ఎస్సీ కాలనీవాసులు శుక్రవారం ఉదయం ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి, ధర్నా నిర్వహించారు.
తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నా పట్టించుకునేవారే కరువయ్యారంటూ ఆవేదన వ్యక్తంచేశారు. కాలనీలోని బోరుమోటరు కాలిపోయిందని సంబంధిత శాఖ అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. నీళ్ల కోసం వ్యవసాయ బోరుబావుల వద్దకు పరుగులు పెట్టాల్సి వస్తోందన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.