కామారెడ్డి, జూలై 15: కామారెడ్డి పట్టణంలో ప్రజలను తాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటికీ మిషన్ భగీరథ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ఇప్పటికీ భగీరథ ద్వారా పట్టణాలతోపాటు గ్రామాలు, పల్లెల్లో సరఫరా అవుతున్నది. ప్రస్తుతం జిల్లాకేంద్రంలోని పలు కాలనీల్లో నీటి ఇబ్బందులు తప్పడంలేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తాగునీటి బెడద తీవ్రంగా మారింది. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, స్థానిక ఎమ్మెల్యే కాటిపల్లి వెంకరమణారెడ్డి ఉన్నప్పటికీ పట్టణంలో నీటి సమస్య పరిష్కారం కావడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. పట్టణంలోని వికాస్‌నగర్‌లో తాగునీటి సరఫరా చేసే మోటర్ పాడవడంతో రెండు రోజుల నుంచి నీటి కష్టాలు మొదలయ్యాయి. దీంతో చాలా కాలనీల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. మున్సిపల్ పాలకవర్గం కూడా లేకపోవడంతో నీటి సమస్యను పరిష్కరించేవారే కరువయ్యారు.
కామారెడ్డి పట్టణంలో సుమారు లక్షా 20 వేల మందికి మిషన్ భగీరథ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. కొందరు మాజీ కౌన్సిలర్లు వారి ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తుండగా.. కాలనీవాసులు వాటిని డ్రమ్ముల్లో నిల్వ ఉంచుకొని వాడుకుంటున్నారు. పట్టణవాసులకు సరిపడా నీటిని సరఫరా చేయకపోవడంతో ఇబ్బందులు తప్పడంలేదు. కొన్నిచోట్ల నాసిరకం పైపులను బిగించడంతో అవి పగిలిపోయి నీటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. నీటి ఇబ్బందులపై మున్సిపల్ కమిషనర్ రాజేందర్‌ను ఫోన్ ద్వారా సంప్రదించగా.. భూగర్భ జలాలు అడుగంటడంతో నీటి సమస్య ఏర్పడిందని, ఎనిమిది ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామని తెలిపారు.