ఏర్గట్ల, మార్చి 30: మండలంలోని తొర్తి గ్రామం కొత్తప్లాట్ కాలనీలో కొన్నిరోజులుగా తాగునీటి కోసం స్థా నికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామంలో 40వేల లీటర్ల నీటి సామర్థ్యం ఉన్న మిషన్ భగీరథ ట్యాంకు నుంచి వేంకటేశ్వర గుడి వెనుకాల ఉన్న కొత్త ప్లాట్ కాలనీకి నిత్యం నీరు సరఫరా చేస్తారు. ఈ కాలనీలో సుమారు 40 కుటుంబాలు నివాసం ఉండగా..రెండు నెలలుగా మిషన్ భగీరథ నీరు రావడం లేదని కాలనీవాసులు వాపోయారు.
ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో కాలనీ లో తాగునీటి సమస్యపై నమస్తే తెలంగాణ దినపత్రికలో ‘తాగునీటి కోసం భగీరథ ప్రయత్నం’ శీర్షికన ఈ నెల 27న కథనం ప్రచురితమైంది. దీనిపై అధికారులు స్పందించారు. కాలనీలో పర్యటించి నీటి సమస్యను తెలుసుకున్నారు.
ఆదివారం ఉగాది పండుగ రోజున అధికారులు దగ్గరుండి సిబ్బందితో కొత్త పైపు లైన్ వేయించారు. రెండు నెలలుగా ఇబ్బందులు పడుతున్న కాలనీవాసుల తాగునీటి కష్టాలు తీరాయి. నీటి గోస తీర్చడానికి కృషి చేసిన నమస్తే తెలంగాణ దినపత్రికతోపాటు మిషన్ భగీరథ అధికారులకు కాలనీవాసులు ధన్యవాదాలు తెలిపారు.