నిజాంసాగర్/మోర్తాడ్, జూన్ 26: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కీలకమైన ప్రాజెక్టులు కళ తప్పాయి. వానాకాలం ఆరంభమై నెల రోజులు సమీపిస్తున్నా జంట జలాశయాలు దాదాపు బోసిపోయాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు డెడ్‌స్టోరేజీకి చేరింది. నిజాంసాగర్‌లో నీటి నిల్వ దారుణంగా పడిపోయింది. లక్షలాది ఎకరాలకు జీవధార అయిన ఈ ప్రాజెక్టుల్లో నీళ్లు లేకపోవడంతో ఆయకట్టు రైతాంగం ఆందోళన చెందుతున్నది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు విస్తరించినా, ఎల్‌నినో ప్రభావంతో ఇప్పటిదాకా భారీ వర్షాలు కురియలేదు. ప్రాజెక్టుల్లోకి నీరు చేరలేదు. వరుణుడు ముఖం చాటేయడం, కొత్త నీరు రాకపోవడంతో వానాకాలం పంటల సాగు సందిగ్ధంగా మారింది.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 1.35 లక్షల ఎకరాల్లో పంటల సాగు నిజాంసాగర్ ప్రాజెక్టుపైనే ఆధారపడి ఉంది. ఇందులో ప్రస్తుతం 6 టీఎంసీల మేర నీళ్లున్నాయి. అయితే, ఎల్‌నినో ప్రభావం కారణంగా సాగర్ నుంచి నీటి విడుదలపై సందేహాలు రేకెత్తున్నాయి. ఇప్పటికే వానాకాలం ఆరంభమైన తరుణంలో కొందరు రైతులు దుక్కులు దున్నుకొని నారు మడిని సిద్ధం చేసే పనిలో ఉండగా, మరికొందరు నార్లు పోశారు. అయితే, సాగర్ ఆయటకట్టు కింద వానాకాలం పంటలు గట్టెక్కాలంటే 9 టీఎంసీల నీళ్లు అవసరం.
కానీ, ప్రాజెక్టులో ప్రస్తుతం ఉన్నది ఆరు టీఎంసీలే. నిజాంసాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1405.00 అడుగుల (17.80 టీఎంసీలు)కు గాను ప్రస్తుతం 1394.78 అడుగుల (6.60 టీఎంసీల) నీరు నిల్వ ఉంది. అయితే, ఇందులోంచి ఆవిరి రూపంలో, లీకేజీల రూపంలో దాదాపు 1.50 టీఎంసీల నీరు వృథాగా పోతున్నది. దీనికి తోడు మరో అర టీఎంసీ డెడ్ స్టోరేజీగా ఉంటుంది. అంటే 2 టీఎంసీలు పోను మిగిలేది 4.80 టీఎంసీలు మాత్రమే. ఆయకట్టు పంటలు గట్టెక్కాలంటే ఇంకా 4 టీఎంసీలకు పైగా నీళ్లు అవసరం. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురియక పోతే పంటలు చేతికందడం గగనంగా మారుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు, ఆయకట్టుకు నీటి విడుదల విషయంలో స్పష్టత లేకపోవడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నల్లగొండ జిల్లాలకు సాగు, తాగునీటిని అందించే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ప్రస్తుతం పూర్తిగా బోసిపోయింది. ఉత్తర తెలంగాణ వరప్రదాయినిగా పేరొందిన ఎస్సారెస్పీ నీళ్లు లేక ఎడారిని తలపిస్తున్నది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు (80 టీఎంసీలు) కాగా, శుక్రవారం నాటికి 1064 అడుగుల (14.910 టీఎంసీలు) నీరు మాత్రమే నిల్వ ఉన్నది. మిషన్ భగీరథ, కాకతీయ కాలువకు నీటి విడుదలతో పాటు ఆవిరి రూపంలో నిత్యం 817 క్యూసెక్కుల నీరు కరిగి పోతున్నది. వానాకాలం ఆరంభమై నెల దగ్గరకొచ్చినా ఇప్పటిదాకా వచ్చిన ఇన్‌ఫ్లో 0.06 టీఎంసీలే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో లక్షలాది ఎకరాల్లో పంటల సాగు ప్రశ్నార్థకంగా మారింది.
జూన్ నెల చివరికొచ్చినా చినుకు జాడ కరువైంది. మోస్తరు వానలు తప్పితే ఇప్పటివరకూ భారీ వర్షాలు కురిసిందే లేదు. అయితే, దీనికి ఎల్‌నినో ప్రభావమే కారణమని వాతావరణ శాఖ చెబుతున్నది. ఈ సారి సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే ఆవకాశముందని, బోర్లు, చెరువులు, కుంటలు, ప్రధాన జలాశయాల కింద ముందస్తు పంటలు సాగు చేయవద్దని సూచిస్తున్నది. మరోవైపు, ఆర్మూర్ డివిజన్‌తో పాటు బాన్సువాడ నియోజకవర్గంలో పంటల సాగు జోరందుకున్నది. ఇప్పటికే మక్క, సోయా, పసుపు పంటలు వేయగా, వరి నాట్లు కూడా ప్రారంభమయ్యాయి. అయితే, బోర్లపై ఆధారపడి పంటలు సాగు చేసినా వర్షాలు కురియకపోతే పరిస్థితి ఏమిటన్న సందేహం వెంటాడుతున్నది
వానాకాలం పంటల సాగు కోసం నిజాంసాగర్ ఆయకట్టుకు నీటి విడుదలపై ఎలాంటి ఆదేశాలూ రాలేదు. స్కివమ్ కమిటీ ఆదేశాల మేరకు నీటి కేటాయింపులు జరుగుతాయి. ఈ సంవత్సరం ఎల్‌నినో ప్రభావం వల్ల నీటి విడుదలలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలియదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నీటిని విడుదల చేస్తాం.
– కిమ్యానాయక్, నీటిపారుదల శాఖ ఈఈ, నిజాంసాగర్
నిజాంసాగర్ ప్రాజెక్టు కింద పది ఎకరాల పొలం ఉంది. ప్రస్తుతం బోర్ల సాయంతో నారుమడిని సిద్ధం చేసుకుంటున్నా. ఈసారి ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉందని చెబుతున్నారు. మరీ వర్షాలు కురుస్తాయో, లేదోనని ఆందోళనగా ఉన్నది. నిజాంసాగర్ నుంచి ఆయకట్టుకు నీటి విడుదల చేస్తారో చేయరో తెలియడం లేదు. ఇప్పటికైతే దేవుడిపైనే భారం వేసి దుక్కులు దున్నుకొని నారుమడిని సిద్ధం చేశా. పంటలు పండితేనే మాలాంటి రైతులు బతికేది. లేదంటే అప్పుల ఉబిలో కూరుకుపోవాల్సి వస్తుంది.
– మనీశ్‌రెడ్డి, రైతు, బుర్గుల్