ఎల్లారెడ్డి రూరల్, జనవరి 29: తమకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ లబ్ధిదారులు ధర్నా చేపట్టారు. బుధవారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి రెవెన్యూ కార్యాలయం ఎదుట ప్రధాన రహదారిపై బైఠాయించారు. ఎల్లారెడ్డిలో ఈ నెల 26న డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ కార్యక్రమాన్ని తూతూ మంత్రంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్ హాజరై ఇద్దరికి మాత్రమే ఇండ్లను అందజేసి, మిగతావారికి అధికారులు అందజేస్తారని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం గొడవ చోటుచేసుకోగా..ఎల్లారెడ్డి కాంగ్రెస్ నాయకులు కల్పించుకొని మూడు రోజుల తర్వాత రెవెన్యూ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి లబ్ధిదారులకు అందజేస్తారని మైక్‌ద్వారా ప్రకటించారు.
దీంతో రెండురోజులుగా లబ్ధిదారులు రెవెన్యూ కార్యాలయానికి క్యూ కట్టారు. అక్కడ వారికి సరైన సమాధానం ఇచ్చేవారే కరువయ్యారు. బుధవారం ఉదయం వచ్చిన లబ్ధిదారులు మధ్యాహ్నం ఆందోళన వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. జాబితాలో తమ పేర్లు ఉన్నాయని., న్యాయంగా తమకు రావాల్సిన ఇండ్లను ఇచ్చేయాలని వారు కోరారు. మూడు రోజులుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నామంటూ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా..వారు తమను చూసి నవ్వుతున్నారని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తంచేశారు. విషయం తెలుసుకొని అక్కడికి వచ్చిన ఇన్చార్జి తహసీల్దార్ చరణ్‌సింగ్ లబ్ధిదారులతో మాట్లాడారు. సోమవారం నుంచి ప్రత్యేక కౌంటర్ ఏర్పాటుచేసి ఇండ్ల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్పడంతో వారు శాంతించారు.