బాన్సువాడ రూరల్/వర్ని, అక్టోబర్ 20 : ప్రతి నిరుపేద కుటుంబానికి గూడు కల్పించాలనే గొప్ప సంకల్పంతో సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకాన్ని అమలు చేసి పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నారని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడ మండలంలోని కోనాపూర్ రైతువేదిక భవనంలో ఆయన మాట్లాడారు. అంతకు ముందు కోనాపూర్, హన్మాజీపేట్, సంగోజీపేట్, కాద్లాపూర్, పులిగుండు తండా, సోమ్లానాయక్ తండా, సంగ్రాం తండా, కాలు నాయక్ తండా, వర్ని మండలం కోకల్ దాస్ తండా, సిద్ధాపూర్, పైడిమల్, అంతాపూర్ గ్రామాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు మంజూరైన బిల్లులను సర్పంచులతో కలిసి అందజేశారు. బాన్సువాడ నియోజకవర్గంలో ఇండ్లులేని నిరుపేదలు ఉండవద్దన్నదే తన సంకల్పమని స్పీకర్ అన్నారు. రాష్ట్రంలో ఏ నియోజకర్గంలో లేని విధంగా బాన్సువాడకు 10వేల డబుల్బెడ్రూం ఇండ్లు మంజూరు చేయించానని తెలిపారు. ఇప్పటికే 5 వేల ఇండ్లు పూర్తికాగా గృహ ప్రవేశాలు చేశారని, మరో ఐదు వేల ఇండ్ల నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు.
ఉమ్మడి జిల్లాలో ఇండ్ల నిర్మాణం చేపడుతున్న లబ్ధిదారులకు ప్రభుత్వం రూ. 50 కోట్లు విడుదల చేసిందన్నారు. ఇప్పటికే కలెక్టర్ల ఖాతాలో జమ అయ్యాయని తెలిపారు. రెండు మూడు రోజుల్లో కాంట్రాక్టర్లు లబ్ధిదారులకు అందజేస్తారని తెలిపారు. అట్టడుగు వర్గాల పేదల కోసం ప్రభుత్వం త్వరలోనే రూ.3 లక్షలతో డబుల్బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టనున్నదని తెలిపారు. స్తోమత లేని పేదలు రెండు గదులతో ఇండ్ల నిర్మాణాలు చేసుకోవచ్చని తెలిపారు. దేశంలోనే అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి బడుగు, బలహీన వర్గాల ప్రజల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. అంతాపూర్ గ్రామంలో రూ. 13లక్షల వ్యయంతో నిర్మించిన అంతాపూర్-పొట్టిగుట్ట తండాల లింకు రోడ్డును ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కండ్ల ఎదుటే కనబడుతున్నా కొంతమంది పని గట్టుకుని విమర్శలు చేస్తున్నారన్నారు.
గట్టు మీది గ్రామాల పంటలకు నీరందిస్తాం
నిజాంసాగర్ ఆయకట్టు రైతులకు పుష్కలంగా ప్రాజెక్టు నీరు అందడంతో రెండు పంటలు పండిస్తున్నారని, గట్టు మీది గ్రామాలైన హన్మాజీపేట్, కోనాపూర్, సంగోజీపేట్, కాద్లాపూర్, సోమ్లానాయక్ తండా, గోపాల్తండాలకు సిద్దాపూర్ రిజర్వాయర్ ద్వారా పంటలకు సాగు నీరు అందించి బీడు భూములను సస్యశ్యామలం చేస్తామని స్పీకర్ భరోసా కల్పించారు. త్వరలోనే సిద్దాపూర్ నుంచి మొండిసడాక్ వరకు కాలువలు తవ్వేందుకు అధికారులు సర్వే చేపట్టనున్నారని తెలిపారు. సర్పంచులు, ఎంపీటీసీలు, రైతులు కాలువల డిజైన్‌కు సహకరించాలని సూచించారు.ప్రభుత్వం ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యాన్ని విక్రయించాలని సూచించారు. కోనాపూర్‌లో ఆర్డీవో రాజాగౌడ్, తహసీల్దార్ గంగాధర్, పీఆర్ డీఈ వెంకటేశ్వర్లు, బోర్లం సొసైటీ అధ్యక్షుడు సం గ్రాం నాయక్, సర్పంచులు వెంకట రమణారావు దేశ్‌ముఖ్, బోనాల సుభాష్, భాస్కర్, ఎంపీటీసీ లు సుధాకర్‌రెడ్డి, జెట్టి హన్మాండ్లు, కాంట్రాక్టర్లు బాల్సింగ్, గంగాధర్ నాయకులు శంకర్ గౌడ్, గోపాల్‌నాయక్, రాజేశ్వర్ గౌడ్, రాసాలం సాయి లు, సమేంద్, సాయిబాబా, బాగయ్య, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు. అంతాపూర్లో ఎంపీపీ మేక శ్రీలక్ష్మీ వీర్రాజు, జడ్పీటీసీ బర్దావల్ హరిదాస్, వైస్ ఎంపీపీ దండ్ల బాలరాజు, మండల కో ఆప్షన్ సభ్యుడు కరీం, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు సింగంపల్లి గంగారాం, పీఏసీఎస్ చైర్మన్లు నామాల సాయిబాబా, కృష్ణారెడ్డి, అప్పిరెడ్డి బోధన్ ఆర్డీవో రాజేశ్వర్, హౌసింగ్ డిప్యూటీ ఈఈ నాగేశ్వర్ రావ్, తహసీల్దార్ విఠల్, సర్పంచులు పద్మా జగ్రాం, కలియా బాయి దశరథ్, భరత్యానాయక్, నాయకులు కన్నా దేవేందర్ పాల్గొన్నారు.