Urea shortage | కోటగిరి : కోటగిరి మండలంలోని సహకార సంఘం, ప్రైవేటు దుకాణాలలో కృత్రిమ యూరియా కొరత సృష్టించొద్దని, రైతులకు అవసరం మేరకు ఎరువులు అందించాలని, కృత్రిమ యూరియా కొరత సృష్టిస్తే శాఖ పరంగా చర్యలు తప్పవని కోటగిరి మండల వ్యవసాయ అధికారి రాజు హెచ్చరించారు.
కోటగిరి మండల వ్యవసాయాధికారి రాజుతో పాటు కోటగిరి ఎస్సై సునీల్ కోటగిరి మండలంలోని కొత్తపల్లి కోటగిరి సహకార సంఘంలో శుక్రవారం నిల్వ ఉన్న ఎరువుల నిల్వలను తనిఖీ చేశారు. గోదాములలో ఎరువుల నిల్వలు ఎంత ఉందని స్థానిక సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రైవేట్ ఫర్టిలైజర్ దుకాణాలలో కూడా ఎరువుల నిల్వలను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా వ్యవసాయ, పోలీస్ అధికారులు మాట్లాడుతూ రైతులు పంట పెరుగుదల దశలవారీగా ఎరువులను కొనుగోలు చేయాలన్నారు. గోదాములలో నిల్వ ఉన్న ఎరువుల వివరాలను నమోదు చేసుకున్నారు. వారి వెంట సహకార సంఘం సిబ్బంది పోలీస్ సిబ్బంది ఉన్నారు.