గాంధారి : నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి సమీపంలోని తెలంగాణ యూనివర్సిటీ పేరును రాష్ట్ర ప్రభుత్వం మార్చాలని ప్రయత్నిస్తోందని, ఆ ఆలోచనను విరమించుకోవాలని కామారెడ్డి జిల్లా పీడీఎస్‌యూ అధ్యక్షుడు సతీష్ అన్నారు. బుధవారం గాంధారి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం పేరుతో ఉన్న ఒకే ఒక్క యూనివర్సిటీ తెలంగాణ యూనివర్సిటీ అన్నారు.
యూనివర్సిటీ పేరును ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం మార్చాలనే ఉద్దేశంతో సర్క్యులర్ జారీ చేసిందని సతీష్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్దఎత్తున ఉద్యమిస్తామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన వెంట పీడీఎస్‌యూ జిల్లా ఉపాధ్యక్షుడు మోజిరాం నాయక్, నాయకులు సుమన్ నగేష్ తదితరులు ఉన్నారు.