మోర్తాడ్, మార్చి11: భీమ్‌గల్ మండలం బడాభీమ్‌గల్ వాగు నుంచి అనుమతుల పేరిట ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. యథేచ్ఛగా ఇసుక అక్రమ తవ్వకాలు చేపడుతున్నా అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇసుక అక్రమ రవాణాపై ఓ వ్యక్తి చేసిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ‘అధికారులు పట్టించుకోరా? అనుమతుల పేరిట ఇసుకను అక్రమంగా తరలిస్తున్నా.. చూసీచూడనట్లుగా ఎందుకు వ్యవహరిస్తున్నారు.. సార్లు .. కొంచెం మీ డ్యూటీకి న్యా యం చేయండి..’ అంటూ పెట్టిన పోస్టు చక్కర్లు కొడుతున్నది. బడాభీమ్‌గల్ వాగు నుంచి ఇసుకను తరలించడానికి సోమవారం అనుమతులు ఇచ్చారు. కానీ ఇచ్చిన వేబిల్లులు తక్కువగా ఉన్నప్పటికీ దాదాపు 200 ట్రిప్పుల ఇసుకను తరలించినా పట్టించుకునేవారు లేకపోవడం, ఇసుక దందాను అరికట్టాల్సిన రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం ఉదాసీనంగా వ్యవహరించడం అనుమానాలకు తావిస్తున్నది. దీనిపై అధికారులను ప్రశ్నిస్తూ ఓ వ్యక్తి చేసిన పోస్టు సోషల్‌మీడియాలో వైరల్ కావడం గమనార్హం.
తహసీల్దార్ల బదిలీ
బాల్కొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇసుక అక్రమ రవాణాకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. అక్ర మ తరలింపు విషయంలో అధికారులు సహకరించకోపోతే వారిని బదిలీ చేయించేందుకు కూ డా అధికార పార్టీ నేతలు వెనకంజ వేయడంలేదు. ఇప్పటికే మోర్తాడ్ తహసీల్దార్ సత్యనారాయణ, భీమ్‌గల్ తహసీల్దార్ లత బదిలీపై వెళ్లా రు. తాజాగా మంగళవారం ఏర్గట్ల తహసీల్దార్ శ్రీలతను కూడా అధికారులు బదిలీ చేశారు. ఇసుక తరలింపు కోసం వేబిల్లులు ఇచ్చేందుకు నిర్మాణంలో ఉన్న ఇండ్ల ఫొటోలు ఇవ్వాలని తహసీల్దార్ కోరడం, ఇసుకాసురులకు ఇబ్బందిగా మారడంతో ఏకంగా తహసీల్దార్‌ను బదిలీ చేయించినట్లు తెలిసింది. భీమ్‌గల్, మోర్తాడ్, ఏర్గట్ల మండలాల్లోని వాగులపై కన్నేసిన అధికారపార్టీ నేతలు తమకు సహకరించకుంటే అధికారులను బదిలీలు సైతం చేయిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
‘ఆ వేబిల్లులతో నాకు సంబంధం లేదు’
ఏర్గట్ల మండలం బట్టాపూర్ పెద్దవాగు నుంచి ఇసుక తరలింపు కోసం తన పేరుమీద జారీ చేసిన వే బిల్లులతో తనకు ఏమాత్రం సంబంధం లేదని మాజీ జడ్పీటీసీ గుల్లె రాజేశ్వర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.