ఖలీల్‌వాడి, డిసెంబర్ 31 : జిల్లా వైద్యారోగ్య శాఖలో డబ్బులిస్తే ఉద్యోగం ఇప్పిస్తామంటూ ఎవరైనా ఫోన్‌చేస్తే నమ్మవద్దని డీఎంహెచ్‌వో బి. రాజశ్రీ సూచించారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. స్టాఫ్ నర్స్ ఉద్యోగాల కోసం మెరిట్ జాబితా సిద్ధం చేశామని తెలిపారు. రూ.1.40 లక్షలు ఇస్తే ఉద్యోగం గ్యారెంటీ అంటూ అభ్యర్థులకు కొందరు ఫోన్లు చేస్తున్నారని, అడ్వాన్స్‌గా రూ. 25 వేలు ఫోన్‌పే చేస్తే మీకు ఉద్యోగం ఇస్తామని లేకుంటే జాబితాలో మీ పేరు ఉండదని పలువురు అభ్యర్థులకు ఫోన్లు వచ్చినట్లు పత్రికల ద్వారా తెలిసిందని చెప్పారు. ఎటువంటి నియామకమైనా శాఖాపరమైన నియమ నిబంధనలు, మెరిట్, రోస్టర్ ప్రాతిపదికన ఉద్యోగాలు ఇస్తారని తెలిపారు. దీనికి జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన ఉన్న జిల్లా నియామక కమిటీ ద్వారా అర్హులైన వారిని నియమిస్తారని పేర్కొన్నారు. ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఇటువంటి పుకార్లను నమ్మవద్దని, పోలీసులను ఆశ్రయించి, ఫిర్యాదు చేయాలని సూచించారు. ఏమైనా సందేహాలు ఉంటే జిల్లా వైద్యారోగ్యాధికారి కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు.