లింగంపేట, జూన్ 25: తమ భూమిని ప్రభుత్వ పాఠశాలకు ఇవ్వగా ఇతర ప్రాంతంలో స్థలం చూపుతామని నేటికీ చూపకపోవడంతో దాతలు పాఠశాల ఆవరణలో వంటావార్పు చేపట్టి నిరసన తెలిపారు. లింగంపేట మండలంలోని శెట్పల్లిసంగారెడ్డి గ్రామానికి చెందిన ఉప్పరి మనెమ్మ, బర్ల భారతమ్మ, ఉప్పరి గంగామణి, కళావతి, అనుసమ్మ, దుర్గయ్యకు చెందిన 1248 సర్వే నంబర్లో ఉన్న వ్యవసాయ భూమిని ప్రభుత్వ పాఠశాల నిర్మాణం కోసం అందించారు. దాతలకు ఇతర చోట భూమి చూపుతామని అప్పట్లో అధికారులు హామీ ఇచ్చారు. దాతలకు వ్యవసాయ భూమి చూపాలని పంచాయతీ పాలకవర్గ సభ్యులు సైతం తీర్మానాలు చేశారు. గతంలోనూ ఆందోళన చేపట్టగా వ్యవసాయ భూమి చూపుతామని చెప్పి అధికారులు చేతులు దులుపుకొన్నారు. ఈ విషయం స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్ దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారానికి నోచుకోకపోవడంతో మంగళవారం బాధితులు పాఠశాల ఆవరణలో వంటావార్పు చేశారు. సర్వే నంబర్ 1248లో గల భూమికి తమకు ఇప్పటి వరకు రైతుబంధు డబ్బులు సైతం వచ్చినట్లు బాధితులు తెలిపారు. ఈ విషయమై మండల విద్యాశాఖ అధికారి రామస్వామిని వివరణ కోరగా పాఠశాల నిర్మాణానికి కేటాయించిన భూమికి బదులుగా ఇతర చోట చూపుతామని చెప్పిన అధికారులు వ్యవసాయ భూమి చూపకపోవడంతో సమస్య నెలకొన్నదన్నారు. ఈ విషయాన్ని తహసీల్దార్ నరేందర్ దృష్టికి తీసుకెళ్లగా బుధవారం గిర్దావర్ను పంపి విచారణ చేపడతామని తహసీల్దార్ చెప్పినట్లు ఎంఈవో తెలిపారు.